నాకు పదవులు ముఖ్యం కాదు: పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By narsimha lode  |  First Published Dec 11, 2022, 2:00 PM IST

తనకు కార్యకర్తలే ముఖ్యమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  తాను పదవుల కోసం పాకులాడలేదన్నారు.  పీసీసీ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ  చోటు ఇవ్వలేదు. ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 



హైదరాబాద్: తనకు పదవులు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. నిన్న ఉదయం  పీసీసీకి చెందిన  కమిటీలను  ఎఐసీసీ ప్రకటించింది.ఈ కమిటీల్లో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు.  ఈ విషయమై ఆదివారంనాడు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ కోసం తాను మంత్రి పదవికే రాజీనామా చేసిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.  ఢిల్లీలో  చాలా హైపవర్ కమిటీలున్నాయని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడబోనన్నారు.  ఎన్నికలకు నెల రోజుల మందు  రాజకీయాలు మాట్లాడుతానని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

నల్గొండ నియోజకవర్గంలో రెగ్యులర్ గా  పర్యటించనున్నట్టుగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. సిరిసిల్ల, గజ్వేల్ లో మాదిరిగా నల్గొండలో  20వేల ఇళ్లు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ కండువా ఉందన్నారు. తర్వాత సంగతి తర్వాత చూద్దామన్నారు. 
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఈ షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం పంపారు.  ఈ విషయమై ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

Latest Videos

also read:టీపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఎన్నికలకు రేవంత్ టీమ్ ఇదే..!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాదించారు. ఈ ఎన్నికల్లో  రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలని ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో బయటకు వచ్చింది. అంతేకాదు అస్ట్రేలియా పర్యటనకు  వెళ్లిన సమయంలో మునుగోడులో  కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది.

టీపీసీసీ చీఫ్  పదవిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  మాత్రం  రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది, పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో  రేవంత్ రెడ్డికి  పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం వెనుక   డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు చేశారు.ఈ వ్యాఖ్యలపై ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు.  ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా  రేవంత్ రెడ్డి తీరుపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి  మండిపడ్డారు.  అంతేకాదు చండూరు సభలో  అద్దంకి దయాకర్  చేసిన వ్యాఖ్యలపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై  రేవంత్ రెడ్డి,  అద్దంకి దయాకర్ లు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. 

click me!