మా ఆయన ఎక్కుడున్నాడో తెలియదు, గుంటూరు శ్రీనుతో అందుకే మాట్లాడా: అఖిలప్రియ

By telugu teamFirst Published Jan 12, 2021, 5:53 PM IST
Highlights

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ విచారణ రెండో రోజు ముగిసింది. తన భర్త భార్గవ్ రామ్ ఎక్కడున్నాడో తనకు తెలియదని అఖిలప్రియ చెప్పారు.

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను పోలీసులు మంగళవారంనాడు విచారించారు. అఖిలప్రియ రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీలు ఆమెను ప్రశ్నించారు. 

కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్స్ మీద వారు విచారణ జరిపారు. తాను రాజకీయ నాయకురాలినని, చాలా మంది తనకు కాల్స్ చేస్తుంటారని, అందులో భాగంగానే గుంటూరు శ్రీనుతో మాట్లాడానని ఆమె విచారణలో చెప్పినట్లు సమాచారం. 

భర్త భార్గవ్ రామ్ ఎక్కడున్నాడనే విషయంపై కూడా ఆమెను ప్రశ్నించారు. తన భర్త భార్గవ్ రామ్ ఎక్కడున్నాడో తనకు తెలియదని ఆమె చెప్పారు. టవర్ లొకేషన్, సిమ్ కార్డు నెంబర్లను కూడా అఖిలప్రియ ముందు ఉంచి ప్రశ్నించారు. తనకేమీ తెలియదని ఆమె జవాబిచ్చారు. తమకూ ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులకు మధ్య భూవివాదం ఉందనే విషయాన్ని ఆమె అంగీకరించారు. 

ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో నిందితులను అంచనా వేయడంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. అనుమానితుల్లో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే ఉన్నారు. ఆధారాలు లేకుండా వారిని అరెస్టే చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించారు. అయితే, అటువంటి సంకట స్థితిలోనే ఓ ఫోన్ కాల్ పోలీసులకు క్లూ ఇచ్చింది. కిడ్నాపర్లను పట్టించింది.

ఎక్కడా దొరకకూడదనే ఉద్దేశంతో కిడ్నాప్ నకు ముందు ఆరు సిమ్ కార్డులను కొనుగోలు చేశారు. వాటిలో ఒక దాని నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చింది. అదే నిందితులను పట్టుకునేలా చేసింది. ఈ విషయాన్ని హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. 

కిడ్నాప్ జరిగిన రాత్రి టీవీ చానళ్లలో వచ్చిన వార్తాకథనాలకు కిడ్పార్లు భయపడ్డారు. సీఎం కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేశారని, దాంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దాంతో తాము క్షేమంగానే ఉన్నామని, ఇంటికి వస్తున్నామని ప్రవీణ్ రావు సోదరుడు సునీల్ రావు ద్వారా ఉత్తర మండలం డీసీపీకి అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఫన్ కాల్ చేయించారు. 

అయితే, కిడ్నాపర్లకు సంబంధించిన క్లూ ఒక్కటి కూడా దొరకలేదు. కిడ్నాపర్లు వాడిన కార్లకు నకిలీ నెంబర్ ప్లేట్లు పెట్టడం వల్ల గుర్తించడం సాధ్యపడలేదు. దాంతో తనకు వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరదనే విషయాన్ని డీసీపీ ఆరా తీశారు. అది బాధితులకు సంబంధించింది కాదని తేలింది. 

దాంతో ఆ నెంబర్ కాల్ డేటాను సేకరించారు. అందులో ఓ కాల్ అఖిలప్రియకు వెళ్లినట్లు తేలింది. దాంతో అనుమానంతో ఆమెను వెంటనే అరెస్టు చేశారు. 

click me!