Hyderabad: పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల ఆధ్వర్యంలో నిఘా కమిటీ నియమించి నిరంతరం పర్యవేక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం (బీహెచ్ఎస్ఎస్) కోరుతుంది.
Class 10 question paper leak: పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ కలకలం రేపుతోంది. 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రం పరీక్ష మొదలైన మూడు నిమిషాలకే వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టింది. ఇది ప్రధానంగా వికారాబాద్ జిల్లా తాండూరు పరిసర ప్రాంత పరీక్షా కేంద్రాల్లో జరిగినట్లుగా సమాచారం. ఈ రోజు హిందీ పరీక్ష పేపర్ సైతం లీకేజీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించిన బాలల హక్కుల సంక్షేమ సంఘం.. పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పరీక్షకు హాజరైన లక్షలాదిమంది విద్యార్థులు ప్రశ్నాపత్రం లీక్ జరిగిందనే అనుమానంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. గుండు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ లు డిమాండ్ చేశారు. నిన్న (సోమవారం) తెలుగు ప్రశ్నాపత్రం సంఘటన మరువక ముందే ఈ రోజు హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో దర్శనం ఇవ్వడం తో అసలు ఏం జరుగుతుందో అని విద్యార్థులు వారి తల్లితడ్రులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ల ఆధ్వర్యంలో నిఘా కమిటీ నియమించి నిరంతరం పర్యవేక్షించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతుంది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మకుండా ఆత్మవిశ్వాసంతో సిద్ధమై పరీక్షలు రాయాలనీ, తల్లితండ్రులు కూడా తమ పిల్లలకు ధైర్యం చెప్తూ వారిలో విశ్వాసాన్ని భరోసాను కలిగించాలని వారు కోరారు.
పరీక్షా కేంద్రాలకు ఎట్టిపరిస్థితుల్లో మొబైల్ ఫోన్లు అనుమతించవద్దనీ, మొబైల్ ఫోన్లు తేవడం వల్లనే ప్రశ్నా పత్రం ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్ల పట్ల కఠినంగా ఉండాలని విద్యాశాఖ అధికారులను బాలల హక్కుల సంక్షేమ సంఘం (BHSS) కోరుతుందని పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విధులు నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా పరీక్షలు సక్రమంగా నిర్వహించుటకు అయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు పూర్తి బాధ్యతతో కృషిచేయాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం పేర్కొంది.