ఇబ్బందుల్లో సోనియా.. రాజీనామా కరెక్ట్ కాదు, ఆయన కాంగ్రెస్ ద్రోహే : రాజగోపాల్ రెడ్డిపై భట్టి ఆగ్రహం

By Siva KodatiFirst Published Aug 2, 2022, 11:11 PM IST
Highlights

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంపై స్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీయే అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంపై స్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సోనియాను ఈడీ వేధిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తగదన్నారు. సోనియాకు అండగా నిలబడాల్సిన సమయంలో అమిత్ షాను కలవడం సరికాదని భట్టి హితవు పలికారు. మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని విక్రమార్క పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీయే అవకాశం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. బీజేపీ దేశానికి చేస్తున్న అన్యాయాలపై సోనియా పోరాటం చేస్తున్నారని.. ఆమెపై కక్షగట్టి బీజేపీ, ఈడీ దాడులు చేస్తోందన్నారు భట్టి విక్రమార్క మండిపడ్డారు. 

అంతకుముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోనియాపై ప్రేమ వుందని, కాంగ్రెస్‌పై గౌరవం వుందని కొందరు తేనేపూసిన కత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులకు కొందరు ఆశపడ్డారని.. సోనియాను ఈడీ పిలిచిన రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే, కొందరు మాత్రం అమిత్ షా దగ్గర కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. సోనియాకు అవమానం జరిగితే.. మోడీ, అమిత్ షాలపై పోరాటం చేయాల్సిన సమయంలో కుక్క బిస్కెట్ల కోసం విశ్వాసఘాతుకులుగా మారారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ హెచ్చరించారు. పార్టీకి నష్టం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:సోనియాను బలిదేవతన్నాడు.. బ్లాక్‌మెయిలింగ్‌తో కోట్లు , డబ్బులిచ్చి పీసీసీ పోస్ట్‌: రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పదవులు ఇవ్వకుంటే.. మీరు బ్రాందీ షాపుల్లో పనిచేయడానికి పనికిరారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను, పదవులను ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే వుంటారని రేవంత్ తెలిపారు. అమిత్ షాను కలిసినప్పుడే కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయిందన్నారు. సోనియాను ఈడీ హింసిస్తున్నప్పుడు శత్రువు పక్కన చేరడం దుర్మార్గమని రేవంత్ దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రెడీగా వుందన్నారు. ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ సిద్ధంగా వుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతామని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ చీఫ్‌గా ఎంపిక కావడానికి రాజగోపాల్ రెడ్డి సహకరించారని ఆయన అన్నారు. 

click me!