
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి స్ట్రాటజీ, ప్రచార కమిటీని కాంగ్రెస్ పార్టీ నియమించింది. మధుయాష్కీ గౌడ్ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ , సంపత్‌లను నియమించారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ రెడీగా వుందన్నారు. ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ సిద్ధంగా వుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతామని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ చీఫ్‌గా ఎంపిక కావడానికి రాజగోపాల్ రెడ్డి సహకరించారని ఆయన అన్నారు.
అంతకుముందు బీజేపీ తన అసలు నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ తెలంగాణను మోడీ అవమానించారని రేవంత్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో గాంధీ కుటుంబంపై ఈడీ కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. మోడీ, అమిత్ ఇచ్చిన కాంట్రాక్ట్‌ల కోసం కొందరు పనిచేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కోవిడ్ బారిన పడి, 75 సంవత్సరాల వయసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోనియాను ఈడీ విచారణకు పిలిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:సోనియాను హింసిస్తుంటే.. అమిత్ షాతో బేరసారాలు, తేనేపూసిన కత్తి : రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ వ్యాఖ్యలు
ఈడీ అంటే బీజేపీ ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ అని ఆర్ధిక లావాదేవీల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ను మోసం చేస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు కనిపించే తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని ఆయన అన్నారు. ఆరు దశాబ్ధాల ప్రజల పోరాటాన్ని గుర్తించి.. ఇచ్చిన మాటకు నిలబడి , ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ చచ్చిపోయినా , కేంద్రంలో అధికారం కోల్పోయినా , తెలంగాణలో అధికారం రాకపోయినా సోనియా వెనక్కి తగ్గలేదన్నారు. తల్లిని అవమానించిన వాడి తల నరికేందుకు సాహసం చేస్తామని రేవంత్ తెలిపారు.
కాంగ్రెస్ పదవులు ఇవ్వకుంటే.. మీరు బ్రాందీ షాపుల్లో పనిచేయడానికి పనికిరారని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలను, పదవులను ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే వుంటారని రేవంత్ తెలిపారు. అమిత్ షాను కలిసినప్పుడే కాంగ్రెస్‌తో పేగు బంధం తెగిపోయిందన్నారు. సోనియాను ఈడీ హింసిస్తున్నప్పుడు శత్రువు పక్కన చేరడం దుర్మార్గమని రేవంత్ దుయ్యబట్టారు.