కళ్లముందు పగుళ్లు అంత స్పష్టంగా కనబడుతుంటే.. ఇంకా తప్పును కప్పిపుచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని, ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని సరిదిద్దుకోండి భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్ పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు. దీనిమీద అసెంబ్లీలో చర్చ ఘాటుగా నడుస్తోంది. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టులో వచ్చింది చిన్న పగులు అని అంటున్నారని… అది పగులు కాదని, నిట్ట నిలువునా చీలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నిర్మాణమే కాదు, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ఇదే పరిస్థితికి వస్తాయని ఎన్ డిఎస్ఎ చెప్పిందన్నారు.
ఇదేదో మేము ఊహించి చెప్పడం లేదని, జ్యోతిష్యం కాదని.. నిపుణుల చెప్పిన మాట అంటూ మల్లు భట్టి విక్రమార్క సభలో చెప్పారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఊటంకిస్తూ… డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో ఎందుకు పని చేయించలేదని అడిగారు. ఎస్సారెస్పీ, దేవాదుల, రాజీవ్ సాగర్లను పూర్తిచేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. వీటిని వదిలేసి లక్ష 72 వేల కోట్లకు బడ్జెట్ పెంచి కాలేశ్వరం కట్టారని అన్నారు.
'కాళేశ్వరంలో అవినీతిపై ఆ మూడు నివేదికల ఆధారంగా చర్యలు': అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం
ఇల్లు కట్టుకుంటేనే మనం ఇంజనీర్ ను పెట్టుకుంటాం.. అట్లాంటిది లక్షల కోట్ల రూపాయలతో కడుతున్న కాలేశ్వరం విషయంలో కెసిఆర్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. ‘కాలేశ్వరం ప్రాజెక్టును నేనే కడతానంటూ… ఇప్పుడు ఏ పరిస్థితికి తీసుకు వచ్చారో చూడండి.. మీరు కట్టిన కాలేశ్వరం నిట్ట నిలువునా చీలిందని.. హరీష్ రావుకు గత గవర్నర్ హరీశ్ రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారని.. ఇప్పుడు కూలిన కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తప్పు ఒప్పుకోవాలని’ బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకున్నాం కాబట్టే మహారాష్ట్ర సీఎంకు లెటర్ రాశామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 152 మీటర్ల ఎత్తులో ఉన్నచోట ప్రాజెక్టు కట్టడానికి ఒప్పుకున్నారని సంబరాలు చేసుకున్నారని అదెలా సాధ్యమని ప్రశ్నించారు.
ఇక చివరికి వంద కిలోమీటర్లు కిందికి వచ్చి కాలేశ్వరం దగ్గర ప్రాజెక్టులు కట్టారు. దీనికోసం మోటార్లని, పైపులని డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. మోటర్లు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంతకు తెచ్చారు? అని ప్రశ్నించారు. ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని… ఇప్పుడు ఏమీ తెలియనట్లు తగుదునమ్మా అని మాట్లాడుతున్నారంటూ భట్టి విక్రమార్క హరీష్ రావు మీద పడ్డారు.