Bharat Bandh: తెలుగు రాష్ట్రాల‌పై భార‌త్ బంద్ ఎఫెక్ట్.. నిలిచిన సేవలు.. !

Published : Mar 28, 2022, 04:10 PM IST
Bharat Bandh:  తెలుగు రాష్ట్రాల‌పై భార‌త్ బంద్ ఎఫెక్ట్..  నిలిచిన సేవలు.. !

సారాంశం

Bharat Bandh: ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ స‌ర్కారు తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌పై భార‌త్ బంద్ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.   

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె (భార‌త్ బంద్‌) కొన‌సాగుతోంది. అయితే, భార‌త్ బంద్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలు, బొగ్గు, ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర‌ ప్రభావం ప‌డింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్ర‌యివేటీక‌రించే కేంద్ర ప్రభుత్వ యోచన, అలాగే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ని నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలను ప్రభావితం చేస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకు సేవ‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. 

అలాగే, తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)లో నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో బొగ్గు ఉత్పత్తి ఆగింది. దాదాపు 42,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో, మొత్తం 23 భూగర్భ మరియు 19 ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు వెలికితీత ప్రభావితమైంది. INTUC, AITUC, CITU మరియు ఇతర కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు (భార‌త్ బంద్‌) పాలక తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అనుబంధ ప్రధాన కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) మద్దతు తెలిపింది. అయితే, భారతీయ మజ్దూర్ సంఘ్ (BSM) ఈ స‌మ్మెకు దూరంగా ఉంది.

నాలుగు నెలల్లోపు SCCLలో ఇది రెండవ సమ్మె. గత ఏడాది డిసెంబర్‌లో నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మూడు రోజుల సమ్మె చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ బ్లాక్‌-3, ఆసిఫాబాద్‌ జిల్లాలోని శ్రావణపల్లి ఓపెన్‌ కాస్ట్‌ బ్లాక్‌-3, భద్రాద్రి కొత్తగూడెంలోని కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌ బ్లాక్‌-3, మంచిర్యాల జిల్లాలోని కళ్యాణఖని అండర్‌గ్రౌండ్‌ బ్లాక్‌-6లను వేలం వేయాలని బొగ్గు గ‌నుల శాఖ ప్రతిపాదించిన సంగ‌తి తెలిసిందే. వేలానికి టెండర్లు పిలిచే ప్రక్రియకు కేంద్రం ముందుకొస్తే నిరవధిక సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

కేంద్రం చ‌ర్య‌ల‌ను తెలంగాణ ప్రభుత్వం కూడా  తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎస్‌సిసిఎల్‌కు చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయితే, బ్యాంకులు, SCCL మినహా తెలంగాణలో సమ్మె పిలుపు పెద్దగా ప్రభావం చూపలేదు. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటో రిక్షాలు యథావిధిగా నడవడంతో ఆ ప్రభావం త‌క్కువ‌గా క‌నిపించింది. అయితే కార్మికులు, ఉద్యోగులు, రైతులను ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. వామపక్షాల నాయకులు నిరసనలకు నాయకత్వం వహించారు.

ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలోనూ నిర‌స‌న‌ ర్యాలీలు జరిగాయి. హన్మకొండలో టీఆర్‌ఎస్‌ నాయకుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ కార్మికులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు తెలిపాయి. ఖమ్మం బస్ డిపో నుంచి ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వకుండా నిరసన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (విఎస్‌పి)ని ప్ర‌యివేటీక‌రించ‌డానికి కేంద్రం తీసుకున్న చర్యల‌ను నిరసిస్తూ తీరప్రాంతంలోని విశాఖపట్నంలో బంద్ పాటిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది. ఏడాదికి పైగా నిరసనలు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేయడంతో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీఎస్‌పీ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ (వీయూపీపీసీ) సమ్మెకు పిలుపునిచ్చింది. విజయవాడలో కేంద్రం అనుసరిస్తున్న ‘కార్మిక వ్యతిరేక’ విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu