
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. వీటికి ఎంతో ప్రతిష్ఠత ఉంది. ఇందులో చాలా దేవాలయలకు గొప్ప చరిత్ర ఉంది. అయితే వీటిలో కొన్ని ఆలయాలు శిథిలావస్థకు చేరి కనుమరుగవుతున్నాయి. ఇలాంటి అలయాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.
శిథిలావస్థకు చేరుకున్న కొన్ని ఆలయాలను దేవాదాయ శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని బాగు చేయిస్తుంటుంది. అయితే కొన్ని ఆలయాలు మాత్రం దేవాదాయ శాఖ పరిధిలోకి రాకపోవడం వల్ల వాటిని ప్రభుత్వం పట్టించుకోదు. దీని వల్ల ఎన్నో ఆలయాలు కనమరుగు అవుతున్నాయి. అలాంటి ఆలయాల జాబితాలోనే కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో ఒక దేవాలయం ఉంది. ఇక్కడ కాకతీయిల కాలం నాటి శివ కేశవ వీరభద్ర స్వామి దేవాలయం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో గుడి మొత్తం చెట్లు చెదలతో చీకట్లు అలుముకపోయింది.
ఈ విషయాన్ని గ్రామస్తులు ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అన్నారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ, వ్యాపార వేత్త పాకాల శ్రీకాంత్ రెడ్డి దృష్టికి ఈ ఆలయ పరిస్థితిని గ్రామస్తులు తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించారు. ఆ గుడిని దత్తత తీసుకున్నారు. ఈ దేవాలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేసి గుడిని పునర్మించారు.
ఈ ఆలయ ప్రత్యేక ఏమిటి ?
ఈ పురాతన ఆలయ విశిష్టత చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆలయంలో శివుడు, విష్ణుమూర్తి ఒకేచోట కొలువై ఉన్నారు. అందుకే శివ కేశవ దేవాలయంగా ఈ గుడి ప్రసిద్ధి గాంచింది. ఇలాంటి అరుదైన దేవాలయాన్ని ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి దాదాపు 40 లక్షల రూపాయలు తన స్వంత డబ్బు ఖర్చు పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దారు. గుడికి రెండు ధ్వజస్తంభాలు స్తంభాలు ఏర్పాటు చేయించారు. ఈ గుడి కోసం ఆయనే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అన్ని అనుమతులు తీసుకొని దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం సందర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయాన్ని తమ కుటుంబం ఆధ్వర్యంలో పునర్నిర్మించటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్నిభవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడంలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు.