హైదరాబాద్‌ను వణికించిన భారీ వర్షం.. హుస్సేన్ సాగర్‌లో కొట్టుకుపోయిన బోటు, అందులో 40 మంది

By Siva KodatiFirst Published Apr 25, 2023, 9:19 PM IST
Highlights

హైదరాబాద్‌ను భారీ వర్షం వణికించింది.  ట్యాంక్‌బండ్ సరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలుల ధాటికి హుస్సేన్‌ సాగర్‌లో వున్న భాగమతి బోటు కొట్టుకుపోయింది. 

హైదరాబాద్‌ను భారీ వర్షం వణికించింది. భారీ ఈదురుగాలులకు తోడు , పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాబోయే కొద్దిగంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం వుందని.. ప్రజలంతా ఇళ్లలోనే అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ట్యాంక్‌బండ్ సరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలుల ధాటికి హుస్సేన్‌ సాగర్‌లో వున్న భాగమతి బోటు కొట్టుకుపోయింది. ఆ సమయంలో అందులో 40 మంది సందర్శకులు వున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారందరినీ రక్షించి .. బోటును ఒడ్డుకు చేర్చారు. 

Latest Videos

కాగా.. దేశంలోని అనేక చోట్ల సోమవారం అకాల వర్షాలు కురిశాయి. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు దంచికొట్టాయి. పలు చోట్ల ఈ గాలి వానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షాలకు పంటలు నాశనం అయ్యాయి. కాగా.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో నలుగురు చనిపోయారు. 

ALso Read: ఈదురుగాలులు, పిడుగులతో హైదరాబాద్‌లో భారీ వర్షం .. ప్రజలు అప్రమత్తంగా వుండాలన్న ఐఎండీ

వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం అకాల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీశాయి. ఇదే సమయంలో వడ్సా మండలం అమ్ వావ్ కు గ్రామానికి చెందిన భరత్ రాజ్ గడె తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నాడు. ఆయన సోమవారం ఉదయం కురకేడ మండలంలో ఉదయం పూట జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరై.. తిరిగి అమ్ వాడకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా వర్షం మొదలైంది.

భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో బైక్ ముందుకు కదలడం కష్టంగా మారింది. దీంతో తన భార్య, పిల్లలతో కలిసి ఆయన ఓ చెట్టు కిందకు వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ఆ చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఆ నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే మరణించారు. ఈ ఘటనతో అమ్ వావ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. 

click me!