AI ఎంతపని చేసింది.. తెలుగు టెకీ జంట ప్రాణాలు తీసిందిగా..!

Published : Mar 31, 2026, 05:03 PM IST
Bengaluru Techie Couple

సారాంశం

బెంగళూరులోతెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన భర్త మొదట ఆత్మహత్య చేసుకోగా ఈ షాక్‌లో భార్య  ప్రాణాలు తీసుకుంది. 

Bangalore : ఐటీ సిటీ బెంగళూరులో తీవ్ర విషాదం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న దంపతులు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన భర్త ముందుగా ప్రాణాలు తీసుకోగా, అతడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేని భార్య అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి చనిపోయింది. ఈ దారుణ ఘటన బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే?

తెలంగాణకు చెందిన భాను చందర్ రెడ్డి (బాబు రెడ్డి), షాజియా భాను చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ చాలాకాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయి 8 ఏళ్లు గడుస్తున్నా మతాలు వేరు కావడంతో ఈ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పలేదు. కొంతకాలంగా బెంగళూరు కొత్తనూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

అమెరికాలో ఉద్యోగం పోవడంతో..

భాను చందర్ రెడ్డి గతంలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ప్రభావంతో తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు సమాచారం. సుమారు ఏడాదిన్నరక్రితం భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికి తోడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ని వేధిస్తున్నాయి. ఈ కారణాలన్నింటితో ఆయన తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

ఒకరి తర్వాత ఒకరుగా ఆత్మహత్య..

నిన్న ఉదయం 9:30 గంటల సమయంలో భార్య షాజియా రూమ్ డోర్ కొట్టినా భాను చందర్ రెడ్డి తలుపు తీయలేదు. కంగారుపడిన షాజియా, సెక్యూరిటీ గార్డుల సహాయంతో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లింది. అక్కడ భాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. కళ్లెదుటే భర్త శవాన్ని చూసి తీవ్ర షాక్‌కు గురైన షాజియా, వెంటనే అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తుకు పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

 డెత్ నోట్‌లో ఏముంది?

సమాచారం అందుకున్న కొత్తనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ వారికి ఒక డెత్ నోట్ దొరికింది. అందులో భాను చందర్ రెడ్డి, 'నా చావుకు నేనే కారణం. షాజియాను ఏమీ అనకండి, ఆమె తప్పేమీ లేదు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను' అని రాసి ఉంది. ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు కూడా ఉన్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు ఏమంటున్నారు?

ఈ ఘటనపై డీసీపీ మిథున్ మాట్లాడుతూ… 'ప్రాథమికంగా చూస్తే అనారోగ్య సమస్యలు, దంపతుల మధ్య గొడవల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భర్త రాసినట్లుగా చెబుతున్న డెత్ నోట్ దొరికింది, దాన్ని పరిశీలిస్తున్నాం. షాజియా ఐబీఎం కంపెనీలో పనిచేస్తోంది. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నాం' అని తెలిపారు. మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరు ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బండి భగీరథ్ ను రిమాండ్ కు తరలించిన పోలీస్ లు | Bandi Bhagirath Case | Asianet News Telugu
Bandi Bhagirath Case: బండి భగీరథ్ పై కవిత సంచలన కామెంట్స్ | Asianet News Telugu