
ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఒక్క సారిగా పెరిగిపోయాయి. మార్చి చివరిలోనే ఇలా ఉందంటే ఏప్రిల్ లోకి ప్రవేశిస్తే ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఫిబ్రవరి మధ్య వరకు కూడా ఈ సారి చలి ప్రభావం కనిపించింది. ఫిబ్రవరి చివరికి వచ్చే సరికి మెళ్ల మెళ్లగా వేడి మొదలైంది. మార్చి మొదటి నుంచి చివరికి వచ్చే సరికి ఇది మరింత పెరిగింది. ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదు అవుతోంది. రాత్రి పూట కూడా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
వచ్చే ఐదు రోజుల పాటు విపరీతంగా ఎండలు మండుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐదు రోజులు వేడి అధికంగా ఉంటుందని, ఎండలు మరింత ముదురుతాయని చెప్పింది. ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే వచ్చే మూడు రోజుల్లో వాతావారణం పొడిగా ఉండే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం డీ హైడ్రేట్ కాకుండా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించే ద్రావణాలు తాగాలని చెబుతున్నారు. కొబ్బరి బోండాలు తాగాలని, నీరు అధికంగా ఉండే ద్రాక్ష, పుచ్చకాయలు తినాలని సూచిస్తున్నారు
మార్కెట్ లో దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా సహజ పానీయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండలో నుంచి వెళ్లి వచ్చిన వెంటనే ఫ్రిజ్ లో నుంచి అతి చల్లని నీళ్లు ఒకే సారి తాగకుండా.. కాసేపు కూర్చొని నెమ్మదిగా నార్మల్ వాటర్ లేదా తక్కువ చల్లటి నీరు తాగాలని చెబుతున్నారు.
మధ్యాహ్నం సమయంలో తప్పనిసరి అయితే తప్పా బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, క్యాప్ లేదా ఎండ నుంచి రక్షణను ఇచ్చే వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. వేడి గాలులు చెవులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఎండ వల్ల వచ్చే చెమటతో స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశం ఉన్నందున్న ప్రతీ రోజు స్నానం చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. బైక్ మీద ప్రయాణించే వారు తప్పని సరిగా హెల్మెట్, చెవులకు, ముక్కులోకి వేడిగాలి వెళ్లకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలి