పోలీసులు సహకారంతోనే అరవింద్ ఇంటిపై దాడి.. దాడి ఘటనపై కేసీఆర్ తక్షణమే స్పందించాలి: బండి సంజయ్

By Sumanth KanukulaFirst Published Nov 19, 2022, 3:15 PM IST
Highlights

ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణంచాయని అన్నారు. రాజకీయాల కోసం కేసీఆర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 

ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణంచాయని అన్నారు. రాజకీయాల కోసం కేసీఆర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ అరవింద్ నివాసంపై దాడి ఘటనపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. శనివారం ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటికి వెళ్లిన బండి సంజయ్.. ఆయనను పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సహకారంతో, వారి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానికి కారణం కూడా లేదన్నారు. దాడి జరిగిన సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న అరవింద్ తండ్రి డీఎస్ ఇంట్లో లేకపోవడం అదృష్టమన్నారు. వినాయకుడిపై, లక్ష్మీ అమ్మవారిపై, పవిత్రంగా భావించే తులసి మాతపై దాడి చేశారని అన్నారు.  దేవుళ్ల మీద నిజమైన హిందువులైతే దాడి చేయరని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఇంటి మీద దాడి జరిగినందుకు కూడా అరవింద్ బాధపడటం లేదని.. దేవుళ్ల మీద జరిగినందుకు బాధపడుతున్నారని చెప్పారు. దీని గురించి హిందూ సమాజం ఆలోచన చేయాలని కోరారు. మహిళల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, ఆమె కుటుంబానికి లేదన్నారు. 

సీఎం కేసీఆర్‌కు, కల్వకుంట్ల కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. తెలంగాణను అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దౌర్జన్యాలను సహించబోమని అన్నారు.  టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. రాజకీయ నేతల ఇండ్లపై దాడులు చేయడం సరికాదన్నారు. దాడులు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనకు ముగింపు పలికేందుకు ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 


 

click me!