
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా తెలుంగాణ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ధర్మపురి అర్వింద్‌పై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్వింద్ మారకపోతే తాము కూడా మారేది లేదన్నారు. అర్వింద్ ఇంటిపై జరిగిన దాడి జస్ట్ శాంపిల్ అంటూ నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ ఎమ్మెల్సీ కవిత గురించి అర్వింద్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని, అర్వింద్ చరిత్ర గురించి చెబితే తలదించుకోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో వుండగా బీఫామ్‌లను అమ్ముకున్న చరిత్ర అర్వింద్ అని దానం నాగేందర్ ఆరోపించారు. ఆయన ఎవరికి బీఫామ్‌లు అమ్మారో వారందరినీ తీసుకొచ్చి నిలబెడతానని దానం హెచ్చరించారు. మరోవైపు.. కల్వకుంట్ల కవితపై చేసిన విమర్శలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్, అర్వింద్ ఇద్దరూ బీసీ ద్రోహులేనని.. అర్వింద్ ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారని, అయితే వాళ్లంతా ఉద్యమకారులని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మరోవైపు.. తమ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తల్లి విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన 50 మంది గూండాలు తమ ఇంటిపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి దిగడమే కాకుండా తనను బెదిరించారని విజయలక్ష్మీ పేర్కొన్నారు. ఈ ఘటనపై విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ఇంట్లో ఎవరూ లేనిది చూసి దాడి చేయడం తప్పని.. విమర్శలు చేస్తే ఇంటిపై దాడులు చేస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాడులకు భయపడేది లేదని విజయ లక్ష్మీ పేర్కొన్నారు.
ALso Read:అప్పుడు ఏమయ్యారు , కవితకో న్యాయం.. అర్వింద్‌కో న్యాయామా : తమిళిసై పై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం
అంతకుముందు తన ఇంటిపై దాడిపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు సవాల్ విసిరారు. ఇంకా దొరల పాలన సాగుతుందని అనుకొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసి మహిళలను భయపెట్టారని, తన తల్లిని బెదిరించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ లో పోటీచేస్తావా చేయాలని కవితకు అరవింద్ సవాల్ చేశారు. విమర్శలు చేస్తే దాడి చేస్తారా అని అర్వింద్ ప్రశ్నించారు
గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పోటీచేసిన 178 మందిలో 71 మంది పసుపు రైతులు బీజేపీలో చేరారన్నారు. తనపై చీటింగ్ కేసు ఏం వేస్తావని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ అని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ పై చీటింగ్ కేసు పెట్టాలని కవితకు సలహా ఇచ్చారు ఎంపీ అర్వింద్. రైతులు గుంపులు గుంపులుగా బీజేపీలో చేరుతున్నారన్నారు. 70 ఏళ్ల వయస్సున్న తన తల్లిని భయపెట్టే హక్కు ఎవరిచ్చారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.