తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలపై కొన్నిచోట్ల అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డిలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి, రెండో జాబితాలోని పేర్లను సమీక్షించి, పునఃపరిశీలించాలని కోరారు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై పార్టీలోని పులువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఇటీవల పార్టీలో చేరిన ప్యారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారని ఆరోపించారు.
అన్ని విధాలుగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సమర్థులైనప్పటికీ నిబద్ధత, విశ్వాసపాత్రులైన నాయకులకు బదులు పారాచూట్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందనే అభిప్రాయం ఉందని లేఖలో పేర్కొన్నారు. పార్టీశ్రేణుల మనోభావాలు, అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, ప్రజల్లో విశ్వాసం నింపడానికి, పార్టీలో ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దడానికి మొదటి, రెండో జాబితాలలో ప్రకటించిన అభ్యర్థుల పేర్లను సమీక్షించి, పునఃపరిశీలించాలని కోరుతున్నట్టుగా తెలిపారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను అక్టోబర్ 15న ప్రకటించగా..45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను అక్టోబర్ 27న ప్రకటించింది. అయితే ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించిన కొందరు నేతలు.. జాబితాల్లో తమ పేరు లేకపోవడంతో రాజీనామాలు చేశారు.