
తెలంగాణ బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని కాంగ్రెస్ అనుకుంటే సరిపోదని.. ప్రజలు అనుకోవాలని అన్నారు. నాగర్‌కర్నూలులో జరిగే నవ సంకల్ప సభకు హాజరయ్యేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బండి సంజయ్, కే లక్ష్మణ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు.
అనంతరం జేపీ నడ్డా నోవాటెల్‌కు చేరుకున్నారు. అక్కడ జేపీ నడ్డా.. టీ బీజేపీ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, విజయశాంతి, రఘునందన్ రావు, మురళీధర్ రావు, వివేక్‌లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వారితో సమాలోచనలు జరుపుతున్నారు. ఇక, ఈ క్రమంలోనే బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు, బీఆర్ఎస్‌కు మధ్య ఒప్పందం ఉంటే.. ప్రజలు ఉప ఎన్నికల్లో తమను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైతే ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా పోయిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు బీజేపీ వ్యతిరేకమని ప్రజలు నమ్ముతున్నందునే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎంలకు వ్యతిరేకంగా 42 సీట్లు గెలుచుకుందని అన్నారు. కాంగ్రెస్ రెండు సీట్లలో మాత్రమే గెలిచిందని.. ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు.
Also Read: హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. వారిని కలిశాక నాగర్ కర్నూలుకు పయనం.. వివరాలు ఇవే..
కాంగ్రెస్ అద్దాల మేడలో ఉందని.. వారు అందులోనే ఉంటారని విమర్శించారు. తాము ప్రజల్లో ఉన్నామని చెప్పారు. తమ వెంట ప్రజలు, సిద్దాంతం కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో అవినీతిని, కుటుంబ పాలనను కేంద్రం డేగ కన్నుతో చూస్తుందని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సహకారంతోనే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తాము గెలుస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయని తాము అనలేదని.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జనారెడ్డిలే చెప్పారని అన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. వాళ్లు బీఆర్ఎస్‌కు పోతారనే ఆ పార్టీని ప్రజలు ఆదరించడం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవద్దని కేసీఆర్ కోరుకుంటున్నాడని.. కాంగ్రెస్‌లో గెలిచిన ఆయన వద్దకే వస్తారని అనుకుంటున్నాడని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ వీక్ ఉన్నచోట.. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారని, వారికి డబ్బులు కూడా ఆయనే భరిస్తారని ఆరోపించారు.