ఢిల్లీలోనే ఈటల, రాజగోపాల్‌రెడ్డి.. నేటి జేపీ నడ్డా ప్రసంగంపై ఫోకస్

By Mahesh KFirst Published Jun 25, 2023, 1:57 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అసంతృప్త నేతలు ఈటల రాజేందర్, కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ బీజేపీ పరిస్థితులపై స్పష్టంగా తెలియజేసినట్టు సమాచారం. కాగా, వారిద్దరూ ఢిల్లీలో ఉండగానే.. 
 

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అసంతృప్త నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా వర్గ విభేదాలు వచ్చాయని, పలువురు నేతల్లో ప్రస్తుత రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి ఉన్నదనే వార్తలు వచ్చిన తరుణంలో బీజేపీ అధిష్టానం అత్యవసరంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిపించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా పిలిపించుకుని సమావేశమైంది. ఈ ముగ్గురితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు జేపీ నడ్డా తెలంగాణకు చేరుకున్నారు. నాగర్ కర్నూల్‌లోని నవసంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. కానీ, జేపీ నడ్డాతో సమావేశమై తమ సమస్యలు, అభిప్రాయాలు పంచుకున్న అసంతృప్త నేతలు ఈటల, రాజగోపాల్ రెడ్డిలు మాత్రం తెలంగాణకు రాకపోవడం గమనార్హం. వారు ఇంకా మరికొందరు అగ్ర నేతలతో సమావేశం కావాలనే ఉద్దేశంతో హస్తినలోనే ఆగినట్టు తెలుస్తున్నది.

బీఆర్ఎస్‌తో బీజేపీకి లోపాయికారిగా ఒప్పందం ఉన్నదని, అందుకే బీఆర్ఎస్ పై బీజేపీ మెతకవైఖరి అవలంభిస్తున్నదనే అభిప్రాయాలు ప్రజల్లో నెలకొంటున్నాయని, కాబట్టి, బీఆర్ఎస్ పై బీజేపీ కఠిన వైఖరి పాటించాలని ఈటల, రాజగోపాల్ రెడ్డిలు నిన్నటి సమావేశంలో చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్‌ను ఓడించే శక్తి, సామర్థ్యం, సంకల్పం తమకే ఉన్నదనే విషయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదని వారు వెల్లడించినట్టు తెలిసింది. కేసీఆర్‌ను ఓడించాలనే బీజేపీలోకి వచ్చిన వారి లక్ష్యం నీరుగారిపోతుందని, వారిపై కాంగ్రెస్‌లో చేరాలనే ఒత్తిడి కూడా ఉన్నట్టు చెప్పారు. ఇన్నాళ్లు తాము ఈ ఒత్తిడిని తట్టుకున్నామని, కానీ, బీజేపీ మెతక వైఖరినే అవలంభిస్తే కష్టమే అనే ధోరణిలో వారు మాట్లాడినట్టు సమాచారం. వారి అసంతృప్తి, అభిప్రాయాలు కూడా వెల్లడించిన నేపథ్యంలో ఈ రోజు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ సభలో ప్రసంగించనున్నారు.

Latest Videos

Also Read: ‘అసంతృప్త నేతలు’ ఈటల, రాజగోపాల్‌కు అధిష్టానం పిలుపు.. గుడ్ న్యూస్ చెబుతారా? బుజ్జగింపులేనా?

అందుకే జేపీ నడ్డా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీల నేతలు సహా తెలంగాణ బీజేపీ నేతలూ ఈ సభలో జేపీ నడ్డా ప్రసంగంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ సభలో ఎప్పటిలాగే కేసీఆర్ కుటుంబ పాలన అంటూ కామెంట్లు చేసి, ఎంఐఎంపై వ్యాఖ్యలు చేసి వెళ్లిపోతారా? లేక బీఆర్ఎస్‌తో ఇక తమది ఢీ అంటే ఢీ అనే వైఖరి అనే సంకేతాలు ఇచ్చేలా మాట్లాడుతారా? అనేది మరికాసేపట్లో తేలనుంది.

click me!