టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ ను సిట్, స్టాండ్ సంస్థగా ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బీజేపీ కార్యాలయంలో బుధవారంనాడు ఉగాది పర్వదిన వేడులకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. సిట్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తనకు సిట్ నోటీసులు అందలేదన్నారు. సిట్ నోటీసులు అంటించిన ఇల్లు ఎవరిదో తనకు తెలియదన్నారు.
సిట్ అంటే సిట్ స్టాండ్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ సర్వసాధారణమని కబ్జాల మంత్రి అంటున్నారని బండి సంజయ్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విమర్శలు చేశారు. అనేక సందర్భాల్లో సిట్ దర్యాప్తు చేశారన్నారు. కానీ ఒక్క సిట్ విచారణలో ఏం తేల్చారో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
పేపర్ లీక్ తో 30లక్షల మంది జీవితాలను కేసీఆర్ సర్కార్ రోడ్డున పడేసిందని బండి సంజయ్ ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే తన దగ్గరున్న సమాచారాన్ని అందజేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. సిట్ నోటీసులు ఇస్తే భయపడతామా? అని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీకేజీపై మాట్లాడిన మంత్రులకు సిట్ నోటీసులు ఎందుకు జారీ చేయడంలేదని బండి సంజయ్ అడిగారు.
రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్షాలన్నీ ప్రజల నుంచి వచ్చిన సమాచారంతోనే మాట్లాడుతామన్నారు. తప్పు చేస్తే కేసులు పెట్టుకోవచ్చన్నారు. కానీ జర్నలిస్ట్ లపై దాడులను ఖండిస్తున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు. పరోక్షంగా తీన్మార్ మల్లన్న అరెస్ట్ గురించి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల కుటుంబాలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమైందని బండి సంజయ్ చెప్పారు. అన్ని శాఖలకు మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా విఫలమైన కేటీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: పెన్ డ్రైవ్ ల్లో క్వశ్చన్ పేపర్లు,మరో 10 మందికి నోటీసులు
మిలియన్ మార్చ్ తరహా నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. గతంలో అటుకులు తిన్న కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తన కుటుంబం కోసం ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలపై కేసీఆర్ ఉక్కుపాదం మోపాడని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. తన బిడ్డ కవిత కోసం కేసీఆర్ క్యాబినెట్ అంతా ఢిల్లీలో కూర్చోవటం దారుణమన్నారు.