
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చెప్పులు అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను టార్గెట్‌గా టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై చేస్తున్న విమర్శలపై బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వరుస ట్వీట్స్‌తో టీఆర్ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకుంటున్న కుటుంబసభ్యుల రహస్యాలు బయట పడకుండా తంటాలు పడుతూ టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు.
గులామ్‌లు అని వెక్కిరించే టీఆర్ఎస్ కుసంస్కారం చూసి జనాల నవ్వుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్‌లాగా అవసరాన్ని బట్టి పొర్లు దండాలు పెట్టడం తమ రక్తంలో లేదన్నారు. రామ, భరతుల వారసత్వాన్ని తాము తలకెత్తుకున్నామని అన్నారు. ప్రొ. జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించిన మీకు.. గౌరవాల విలువ ఏమీ తెలుస్తుందని మండిపడ్డారు.
‘‘ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకుంటున్న కుటుంబసభ్యుల రహస్యాలు బయట పడకుండా తంటాలు పడుతూ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు...!. అవసరం ఉంటే కాళ్లు మొక్కడం...లేదంటే కాళ్ళు పట్టి గుంజడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య... కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు కేంద్ర హోం మంత్రివర్యులకు వయస్సులో చిన్నవాడినైన నేను చెప్పులందించడం గులామ్ గిరియా?
మీరు సాష్టాంగ దండ ప్రణామం చేసినపుడు బెంగాల్ కూ... తమిళనాడుకూ గులామ్లు అయ్యారా ?. ఇపుడు పాదరక్షలు అందిస్తే గుజరాత్ గులామ్ అయినట్టా?. కేసీఆర్‌లాగా అవసరాన్ని బట్టి పొర్లు దండాలు పెట్టడం మా రక్తంలో లేదు. ప్రొఫెసర్ జయశంకర్ సారును, కొండా లక్ష్మణ్ బాపూజీని ఘోరంగా అవమానించిన మీకు.. గౌరవాల విలువ ఏమీ తెలుస్తుంది. మమ్మల్ని 'గులామ్' లని వెక్కిరించే మీ కుసంస్కారం చూసి జనం నవ్వుకుంటున్నారు.
అధికారం కోసం లోపటింట్లో రోజూ తన్నుకుంటున్న మీ కుటుంబసభ్యులకు,పెద్దలకు చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థం అవుతది?. రామ - భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం. తండ్రిని బంధించి,అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు, మా సంస్కృతి ఏం అర్థమవుతుంది? మేం పాద రక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం..! మీలా అవసరం తీరాక పాదాలుపట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం " గులామ్" లం కాదు - మీలా మజ్లిస్ కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు’’ అని బండి సంజయ్ ట్వీట్స్‌లో పేర్కొన్నారు.
ఇక, అమిత్ షాను బండి సంజయ్ చెప్పులు అందించిన వీడియో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ? అంటూ బీజేపీ వ్యతిరేక వర్గం ఆయనను ప్రశ్నించింది. భవిషత్తులో అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెడతారనడానికి ఈ ఘన ఉదాహరణ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఎందుకింత బానిసత్వం? అంటూ బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు.