మెడికో ప్రీతి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ పరామర్శించారు.
వరంగల్: మెడికో ప్రీతి ఆత్మహత్య ఎలా జరిగిందో ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివారంనాడు మెడికో ప్రీతి కుటుంబ సభ్యులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. మెడికో ప్రీతి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి బండి సంజయ్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికో ప్రీతి ఘటనపై మంత్రి కేటీఆర్ , కేసీఆర్ లు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. గిరిజన కుటుంబానికి చెందిన ప్రీతి ఆత్మహత్య చేసుకొంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన అడిగారు. పనికిమాలిన అంశాలపై ట్వీట్లు చేసే కేటీఆర్ మెడికో ప్రీతి విషయమై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రీతి డెడ్ బాడీని నిమ్స్ నుండి వరంగల్ కు రహస్యంగా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో హోం మంత్రి ఎవరున్నారో తెలియదన్నారు. పాతబస్తీకే హోమంత్రి పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరుసగా విద్యార్దుల ఆత్మహత్యలు , మహిళలపై దాడుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కానీ ప్రభుత్వం నుండి స్పందనలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం ఎందుకు సమీక్షలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
also read:మెడికో ఆత్మహత్య కేసు : ప్రీతి డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్ చేశారు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
ఎస్ టీలంటే కేసీఆర్ కు కోపమన్నారు. అందుకే ప్రీతి విషయంలో ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రేపు పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగుతానని బండి సంజయ్ ప్రకటించారు.గత నెల 22వ తేదీన మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సీనియర్ సైఫ్ వేధింపుల కారణంగా ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కూడా స్పందించలేదని ప్రీతి పేరేంట్స్ ఆరోపించారు.