నేడు కరీంనగర్‌లో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా..

Published : Dec 15, 2022, 10:26 AM IST
నేడు కరీంనగర్‌లో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా..

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు కరీంనగర్‌లో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు కరీంనగర్‌లో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధర్ రావు, ఎంపీ లక్ష్మణ్ సహా ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. అయితే ఈ సభలో జేపీ నడ్డా ప్రసంగంలో ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది.

బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలను, ప్రజలను సభకు తరలిస్తున్నారు. లక్ష మందికి పైగా జనసమీకరణ చేసి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు గత కొద్ది రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక, బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర గత నెల 28న నిర్మల్ జిల్లా నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

నడ్డా టూర్ సాగనుందిలా..
జేపీ నడ్డా ఈరోజు కర్ణాటక, తెలంగాణలలో పర్యటించనున్నారు. జేపీ నడ్డా ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత కర్ణాటక చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం జేపీ నడ్డా కర్ణాటక నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. పార్టీ నేతలు స్వాగతం పలికిన అనంతరం జాతీయ అధ్యక్షుడు శంషాబాద్ విమానాశ్రయం దగ్గర అరగంట సేపు ఉండి పార్టీ నేతలతో చర్చించనున్నారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్‌లో గంటసేపు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించి సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి హైదరాబాద్ చేరుకుని న్యూఢిల్లీకి బయలుదేరుతారు.

ఇక, బండి సంజయ్ భైంసా నుంచి ప్రారంభించిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, జగిత్యాల్, కొండగట్టు, గంగాధర మీదుగా సాగింది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సంజయ్ 222 కిలోమీటర్లు నడిచారు. ఐదు విడతలతో బండి సంజయ్ మొత్తంగా దాదాపు 1,400 కిలోమీటర్లు నడిచారు. రాష్ట్రంలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు. 

బుధవారం కరీంనగర్ పట్టణ శివారులో మీడియాతో మాట్లాడిన సంజయ్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంతం కాబోతోందని జోస్యం చెప్పారు. త్వరలో కేసీఆర్ పాలన ముగియబోతోందని.. తెలంగాణలో బీజేపీ రామరాజ్యాన్ని స్థాపిస్తుందని అన్నారు. కేసీఆర్ తప్పుడు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu