
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ నలుగురు వ్యక్తులు పోలీసులకు అడ్డంగా దొరికిపోవడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.100 కోట్ల డబ్బుతో పాటు కోట్లాది రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు , అదే విధంగా ఇతర పదవులు ఎరగా చూపి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావాల్సిందిగా ప్రలోభ పెట్టారని బాల్క సుమన్ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నలుగురు ఎమ్మెల్యేలు పోలీసులకు అందజేశారని.. మంగళవారం వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని ఆయన తెలిపారు.
మునుగోడులో టీఆర్ఎస్ గెలవబోతోందనే భయంతో అనేక రకాలుగా కుట్రలకు తెరలేపిందని బాల్క సుమన్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని.. ఇలాంటి పనులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. బీజేపీ నేతలు దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రలోభాలతో చిల్లర వేషాలు వేస్తున్నారని... కేసీఆర్‌తో పెట్టుకుంటే బీజేపీ కొరివితో తలగోక్కున్నట్లేనని ఆయన హెచ్చరించారు. అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని మీరు కొనచ్చునని.. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కేంద్రం కుట్రలను బయటపెట్టారని బాల్క సుమన్ తెలిపారు.
అంతకుముందు దీనిపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు. రామచంద్రభారతి సంప్రదింపులు చేసినట్లు సమాచారం అందిందని సీపీ చెప్పారు. నందకుమార్, సింహయాజులులు రామచంద్రభారతిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయిస్తే పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమాచారం ఇచ్చారని.. ఫామ్ హౌస్‌లో దాడులు చేశామని రవీంద్ర అన్నారు. రామచంద్రభారతి ఫరీదాబాద్ టెంపుల్‌లో వుంటారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతి నుంచి కూడా ఒక స్వామిజీ ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు. వీళ్లంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోందని సీపీ చెప్పారు. ఏమని ప్రలోభాలు పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. డబ్బులు, కాంట్రాక్ట్‌లు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోందని రవీంద్ర అన్నారు.