కొడుకు , కూతురి భవిష్యత్ గురించే... తెలంగాణకు చేసిందేం లేదు : కేసీఆర్‌పై రాజగోపాల్ రెడ్డి ఫైర్

By Siva KodatiFirst Published Oct 26, 2022, 7:32 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొడుకు రాజకీయ భవిష్యత్తు, కుమార్తె వ్యాపారాల గురించే కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

గడిచిన మూడన్నరేళ్ల కాలంలో మునుగోడు నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించినట్లు చెప్పారు మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బుధవారం తన హామీపత్రాన్ని సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రశ్నలపై ప్రభుత్వం ఒక్కరోజు కూడా స్పందించలేదని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు రెండోసారి కూడా మోసపోయారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

దీనిని గమనించాకే ఈటల రాజేందర్, రఘునందన్ రావులను ప్రజలు గెలిపించారని ఆయన అన్నారు . కొడుకు రాజకీయ భవిష్యత్తు, కుమార్తె వ్యాపారాల గురించే కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. ఇలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఏం చేయలేడని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ విషయం ప్రజలకు అర్దమయ్యిందని.. దీనిలో భాగంగానే మునగోడు ఉపఎన్నిక కూడా వచ్చిందని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. అప్పులపాలై, ఆగమైన తెలంగాణ మళ్లీ గాడిలో పడాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. 

తాను రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మంత్రులను కలిశానని.. వారి సహకారంతోనే మునుగోడును అభివృద్ధి చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రాంతాల అభివృద్ధి విషయంలో కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ 90 శాతం పూర్తయ్యిందని.. రూ.100 కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ల రీ డిజైన్ పేరుతో లక్షల కోట్లు అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. 

Also Read:మునుగోడు బై పోల్: జ్వరంతో బాధపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ రోజు ప్రచారానికి దూరం..!

ఇదిలా ఉంటే.. సోమవారం మునుగోడు నియోజకవర్గం సంస్థాన్  నారాయణ్ పూర్ మండలం వెంకం భావి తండాలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  దంపతులు గిరిజనుల మధ్య  దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గిరిజన సంప్రదాయ దుస్తుల్లో రాజగోపాల్ రెడ్డి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  

ఇక, మునుగోడులో భారీ బహిరంగ సభతో ఉప ఎన్నిక ప్రచారాన్ని ముగించాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 31న మునుగోడు పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

click me!