తెలంగాణ సీఎం కేసీఆర్ తో చిరంజీవి నాయకత్వంలోని సినీ పెద్దలు చర్చలు జరపడంపై నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో చర్చల విషయం తనకు తెలియదని అన్నారు.
హైదరాబాద్: సినిమా పరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలోని సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జరిపిన చర్చలపై నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో సినీ పెద్దలు చర్చలు జరిపిన విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. పత్రికల ద్వారా, టీవీ చానెళ్ల ద్వారా ఆ విషయం తాను తెలుసుకున్నట్లు తెలిపారు.
లాక్ డౌన్ కాలంలో సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కుందని చెప్పారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని ఆయన అన్నారు. సినిమా షూటింగులు ఎలా, ఎప్పుడు జరపాలో తనను ఎవరైనా అడిగితే సలహాలు ఇస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట అని ఆయన అన్నారు. తనను ఎవరూ ఏ సమావేశానికీ పిలువలేదని ఆయన చెప్పారు. సినీ సమావేశమని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన నిందించారు.
undefined
గురువారం ఉదయం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ వచ్చిందని, అందరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.
బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, సోదరుడు నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.
దివంగత ఎన్టీఆర్ ముందు చూపుతో ఆలోచించేవారని బాలకృష్ణ అన్నారు. ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే అందుకు ఎన్టీఆర్ చేపట్టిన అభివృద్ధఇ కార్యక్రమాలే కారణమని ఆయన అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానసపుత్రికలని ఆయన అన్నారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని ఆయన అన్నారు.