Bairi Naresh vs Ayyppa Devotees : అయ్యప్ప స్వాములపైకి దూసుకెళ్లిన బైరి నరేష్ కారు ... తీవ్ర ఉద్రిక్తత

By Arun Kumar P  |  First Published Jan 2, 2024, 8:21 AM IST

బైరి నరేష్, అయ్యప్ప స్వాములకు మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఆయన కారు ఢీకొని అయ్యప్ప మాలధారులు గాయపడగా... తప్పించుకుని వెళుతూ ఆయన కారు బోల్తా పడింది. 


ములుగు : హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గతంలో అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తికవాది బైరి నరేష్ వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. తాజాగా   అయ్యప్ప మాలధారుడిని కారుతో ఢీకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. అంతేకాదు పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో నరేష్ కూడా ప్రమాదానికి గురయ్యాడు. ఇలా నూతన సంవత్సరం ప్రారంభంరోజే బైరి నరేష్, అయ్యప్ప స్వాముల వివాదం మళ్లీ మొదలయ్యింది. 

వివరాల్లోకి వెళితే... ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బిఆర్ ఫంక్షన్ హాల్లో భారత నాస్తిక సమాజం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో బైరి నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అయితే గతంలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను అడ్డుకునేందుకు భారీగా అయ్యప్పస్వాములు పంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. తాము భక్తిశ్రద్దలతో కొలిచే స్వామిపై  నోటికొచ్చినట్లు మాట్లాడిన నరేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప మాలధారులు డిమాండ్ చేసారు. అందుకు అంగీకరించని బైరి నరేష్ కారెక్కి వెళ్లిపోతుండగా అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. 

Latest Videos

అయ్యప్ప స్వాముల చుట్టుముట్టడంతో తప్పించుకునేందుకు నరేష్ ఎక్కిన కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. దీంతో అదికాస్త అయ్యప్ప మాలధారులపైకి దూసుకెళ్లింది. ఈ కారు ఢీకొని నర్సింలు అనే మాలధారుడి కాలు విరిగిపోగా మరికొందరు స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికీ కారు ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చారు.దీంతో ఆగ్రహించిన అయ్యప్ప స్వాములు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. 

Also Read  న్యూ ఇయర్ సంబరాల్లోనూ పాలిటిక్స్ ... రేవంత్ సాంగ్ పై రేగిన చిచ్చు... కాంగ్రెస్ నేత దారుణ హత్య

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బైరి నరేష్ ను పట్టుకునేందుకు ప్రయత్నించడం మరో ప్రమాదానికి దారితీసింది. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో భద్రాచలం వైపు వేగంగా వెళుతున్న బైరి నరేష్ కారు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతూ అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన మైలురాయిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైరి నరేష్ తో పాటు డ్రైవర్ కూడా ఎలాంటి గాయాలు కానట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి కారులోని వారంతా పరారయ్యారు. 

అయ్యప్ప స్వాములను కారుతో ఢీకొట్టి గాయపర్చిన బైరి నరేష్, ఆయన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 
 

click me!