నూతన సంవత్సర వేడుకల్లో రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. బిఆర్ఎస్ కార్యకర్తల చేతిలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి : నూతన సంవత్సర వేడుకల్లో కేవలం ఒక పాట విషయంలో చెలరేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రూపొందిన సాంగ్ ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోంది. దీంతో న్యూ ఇయర్ వేడుకల్లో కొందరు యువకులు ఈ సాంగ్ పెట్టగా ఆపాలని బిఆర్ఎస్... ఆపొద్దని కాంగ్రెస్ శ్రేణులు గొడవకు దిగారు. ఈ ఘర్షణలోనే కాంగ్రెస్ కార్యకర్తపై బిఆర్ఎస్ నేతలు బీర్ సీసాలతో కొట్టిచంపారు. ఈ దారుణం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు, మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు డిసెంబర్ 31 అంటే గత ఆదివారం న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 'మూడు రంగుల జెండా' పాటు పెట్టుకుని యువకుడు డ్యాన్స్ చేస్తుండగా బిఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఆ పాటను ఆపాలని... బిఆర్ఎస్ పార్టీ పాటలు పెట్టాలని యువకులకు బెదిరించారు.
బిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పాటను ఆపాలంటున్నారని యువకులు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత సాదుల రాములు(45) పై బిఆర్ఎస్ కార్యకర్తలు కీసర రవి, కొంగల అనిల్, కొంగల వినోద్, గోపాల్ బీరు సీసాలతో దాడి చేసారు. రాములు ఛాతిపై బీరు సీసాలతో బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Also Read కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. రాజాసింగ్ ఆగ్రహం.. వీడియో వైరల్
కాంగ్రెస్ నేతను బిఆర్ఎస్ కార్యకర్తలు హత్య చేయడంతో నాచుపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలిసి నసురుల్లాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాములును హత్యచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ మృతదేహంతో కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. చివరకు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు అంగీకరించారు.
రాములు హత్య నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంయమనంతో వుండాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అంతేకాదు గ్రామంలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటుచేసారు.