కేంద్రానిది తుగ్లక్ చర్యే

Published : Nov 10, 2016, 07:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
కేంద్రానిది తుగ్లక్ చర్యే

సారాంశం

నిజంగానే కోట్లాది రూపాయల నల్లధనం ఉన్నవారు తమ వద్ద ఉన్న డబ్బును ఏదో ఒక విధంగా మారకం చేసుకుంటారు. అందుకు వారి ముందున్న మార్గాలు సవాలక్ష.

కేంద్రప్రభుత్వం చర్యలు తుగ్లక్ పరిపాలనను తలపిస్తోంది. తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఎకనమిక్ అఫైర్స్ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చేసిన ప్రకటనతో యావత్ దేశప్రజలు విస్తుపోతున్నారు. పై ఇద్దరూ మాట్లడుతూ, త్వరలో కొత్త డిజైన్లతో మళ్ళీ వెయ్యి రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఉన్నవి రద్దు చేయటం ఎందుకు, మళ్ళీ కొత్త రూపంలో అంతే విలువకలిగిన కొత్త నోట్లను విడుదల చేయటం ఎందుకో ప్రజలకు అర్ధం కావటం లేదు. మొన్నటి వరకూ చెలామణిలో ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేయటంతో కోట్లాది విలువైన నోట్లు ఎందకూ పనికిరాకుండా పోయాయి. పైగా ముందుచూపేలేకుండా పెద్ద నోట్లను రద్దు చేయటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు.

 చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి తిరిగి అంతే విలువ కలిగిన నోట్లను కొత్త డిజైన్లలో తీసుకుని వచ్చే బదులు ఉన్న నోట్ల చెలామణినే పటిష్టం చేయవచ్చు కదా అన్నది ప్రజల వాదనగా ఉంది. ఉన్నవి హటాత్తుగా రద్దు చేయటంమంటే కోట్లాది మంది సామాన్య, మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజలను ఇబ్బందుల పాల్జేయటం తప్ప కేంద్రం సాధిస్తున్నదేమీ లేదని పలువురు వాపోతున్నారు.

నిజంగానే కోట్లాది రూపాయల నల్లధనం ఉన్నవారు తమ వద్ద ఉన్న డబ్బును ఏదో ఒక విధంగా మారకం చేసుకుంటారు. అందుకు వారి ముందున్న మార్గాలు సవాలక్ష. ఇప్పటి వరకూ వెయ్యి, 500 రూపాయలను దాచుకున్న వారు రేపటి నుండి 2 వేల రూపాయలను దాచుకుంటారు అంతే తేడా. దాచుకోవటం ఖాయం, దోచుకోవటం ఖాయంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే, నల్లధనం నియంత్రణ పేరుతో కేంద్రం చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నది మాత్రం మామూలు ప్రజలేనన్నది సామాన్యుల వాదన.

  నల్లధనం అరికట్టేందుకు దేశంలో పేరు గోప్ప చట్టాలు, వ్యవస్ధలు చాలానే ఉన్నాయి. కానీ అవేవీ ప్రభావవంతంగా పనిచేసినట్లు ప్రజలు ఎన్నడూ చూడలేదు. నిజంగానే వ్యవస్ధలన్నీ వేటి పని అవి చేసుకుపోతే, రాజకీయ వ్యవస్ధ చట్టాలను పనిచేసుకోనిస్తే ఏ నోట్లను రద్దు చేయనక్కర్లేదని మెజారిటి ప్రజల మనోగతంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వరా బహిర్గతమవుతోంది. ఘనత వహించిన మోడి సర్కార్ మాత్రం ఆ మాటలను వినిపించుకునే పరిస్ధితుల్లో లేదన్నది కూడా వాస్తవం.

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ దగ్గరకెళ్లి మరీ దండంపెట్టిన రేవంత్... ఈ టైమ్ లో కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
School Holiday : రేపు స్కూళ్లకి సెలవు..? ఈ సడన్ హాలిడే ఎందుకో తెలుసా?