అయోధ్య రాముడిని దర్శించుకోవాలంటే హైదరాబాదీ సంస్థం తయారుచేసిన ద్వారాలను దాటుకుని వెళ్ళాల్సిందే. ఇలా అయోధ్య ఆలయ నిర్మాణంలో తెలంగాణ సంస్ధ భాగస్వామ్యం అయ్యింది.
హైదరాబాద్ : అయ్యోధ్య ఆలయం ... ఇది దేశంలోని మెజారిటీ ప్రజల కల. హిందువులు శ్రీరాముడు పుట్టిపెరిగిన స్థలంగా నమ్మే అయోధ్యలో ఎట్టకేలకు మందిరం వెలిసింది. అద్భుతంగా నిర్మించిన ఆలయాన్ని వచ్చేనెల అంటే 2024 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయోధ్య రామయ్యను దర్శించుకుని తరించాలని భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారి కల త్వరలోనే నెరవేరి రామయ్య దర్శనభాగ్యం కలుగనుంది.
అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య ఆలయ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేస్తోంది రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇలా అద్భుత శిలా సంపదతో అత్యధ్బుత కళా నైపుణ్యంతో నిర్మించిన అయోధ్య ఆలయానికి మరింత అందాన్ని అద్దే అరుదైన అవకాశం తెలంగాణ వ్యాపారికి దక్కింది. అయోధ్య రాములోరి గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసే అన్ని ద్వారాలు తయారుచేసే అవకాశం సికింద్రాబాద్ లోని అనురాధ టింబర్ ఎస్టేట్ కు దక్కింది. అయోధ్యలోనే ప్రత్యేకంగా ఓ కర్మాగారాన్ని ఏర్పాటుచేసుకుని మరీ ఆలయ ప్రధాన ద్వారంతో పాటు మిగతావాటిని సుందరంగా చెక్కారు కార్మికులు. ఇప్పటికే ద్వారాలు, తలుపుల తయారీ పూర్తవగా వాటిని ఆలయంలో బిగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య ఆలయ ద్వారాల తయారీకి అనేక కంపనీలు ముందుకు వచ్చిన హైదరాబాద్ సంస్థకే ఆ అవకాశం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం పునర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ద్వారాలను కూడా ఇదే అనురాధ టింబర్స్ చేపట్టింది. ఇది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు నచ్చడంతో అయోధ్య ఆలయ ద్వారాల తయారీ అవకాశం ఈ సంస్థకు దక్కింది.
Also Read JanakpurDham to Ayodhya Dham : అయోధ్యరాముడికి అత్తవారింటినుంచి పట్టువస్త్రాలు, ఆభరణాలు, కానుకలు..
అద్భుత కళా సంపదతో నిర్మిస్తున్న అయోధ్య ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేలా ద్వారాలు, తలుపులు తయారుచేసినట్లు అనురాధ టింబర్స్ యజమాని చదలవాడ శరత్ బాబు తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారంతో పాటు 118 ద్వారాలు తయారుచేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ద్వారం అద్భుతంగా తయారుచేసామని... దీనికి బంగారు పూతపూయడంతో తలతలా మెరిసిపోతోందన్నారు. కేవలం నాణ్యమైన బల్లార్షా టేకుతోనే అయోధ్య ఆలయ ద్వారాలన్ని తయారుచేసినట్లు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశిస్సులతోనే అయోధ్య రామయ్య సేవ చేసుకునే అవకాశం దక్కిందని శరత్ బాబు అన్నారు.
ఇదిలావుంటే మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కూడా అయోధ్య రామయ్య సేవలో భాగస్వామ్యం అవుతోంది. ప్రస్తుతం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఎంఏ (ఆచార్య) చేస్తున్న మోహిత్ పాండే అయోధ్య ఆలయ పూజారిగా ఎంపికయ్యాడు. అయోధ్య రామయ్య సేవలో తరించే 50 మంది అర్చకుల్లో ఎస్వీయూలో వేదం అభ్యసించిన అర్చకుడు కూడా వుండన్నాడన్నమాట.