
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణకు హాజరు కావడం మీద దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఈడి ఎదుట హాజరయ్యారు. దీనిమీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బిజెపి లక్ష్యంగా సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బిజెపి ఎంపీలు పిలుపునిచ్చారని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
అంతేకాదు బిజెపి ఎంపీలు.. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లలో ఆయుధాలు పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు గుర్తించారు. కవిత ఈడి విచారణ నేపథ్యంలో మరోమాట రాస్తూ.. కేంద్రంలోని మోడీ సర్కార్ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం ఇలాంటి ఎత్తుగడలకు తెరలేపుతోందన్నారు.
కవిత ఈడీ విచారణ: పరిస్థితిపై కేసీఆర్ ఆరా.. అరెస్ట్ చేస్తే భారీ ప్లాన్.. ఆప్ నేతలతో మంతనాలు..!!
ఇక మరోవైపు, ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణకు హాజరైన నేపథ్యంలో.. జరగబోయే పరిణామాలపై అనేక ఊహాగానాలు వెలబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడి నోటీసులు జారీ చేయడంపై స్పందిస్తూ తెలంగాణ ప్రజల కోసమే కవిత అక్రమ మద్యం డీల్ కు పాల్పడ్డారా అని ప్రశ్నించారు.
ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బులను.. పంట రుణాల మాఫీకి ఖర్చు చేస్తున్నారా? లేకపోతే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి వాడుతున్నారా? నిరుద్యోగ భృతికి ఏమైనా ఖర్చు చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. ‘ కవితను అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా..’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని లేపింది.
ఇక, ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణకు హాజరైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులోని ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న టిఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉంటూ అన్ని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాలను బట్టి కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే మంత్రులు కేటీఆర్ హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ నేతలు టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే.
వీరితో పాటు మరికొంతమంది టిఆర్ఎస్ నేతలను కూడా ఢిల్లీకి వెళ్లాల్సిందిగా ఆదేశాలు వెళ్లినట్లుగా సమాచారం తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఒకవేళ ఈడీ విచారణ ముగిసి కవితను అరెస్టు చేసినట్లయితే.. ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. దీనికోసం ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నారు. నిరసన కార్యక్రమాలను ఆప్ నేతల సహకారం కూడా తీసుకొని చేపట్టాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.