సోనియా గాంధీ, రేణుకా చౌదరి రాజ్యసభకు.. ఖమ్మం లోక్ సభ టికెట్‌ ఎవరికబ్బా!

By Mahesh K  |  First Published Feb 14, 2024, 2:37 PM IST

రాజస్తాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లుతున్నారు. దీంతో ఆమె లోక్ సభ బరిలో నుంచి తప్పుకున్నట్టయింది. నిన్నా మొన్నటి వరకు ఖమ్మం నుంచి ఆమె లోక్ సభ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. కానీ, ఆమె రాజస్తాన్ నుంచి పెద్దల సభకు వెళ్లడం, తెలంగాణ నుంచి రేణుకా చౌదరి కూడా రాజ్యసభకు వెళ్లుతుండటంతో కాంగ్రెస్ ఆశావహులలో ఖమ్మం టికెట్ ఆశలు పెరిగాయి.
 


Sonia Gandhi: సోనియా గాంధీని ఖమ్మం లోక్ సభ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా సోనియా గాంధీని కలిసి విన్నవించారు. ఆమె తెలంగాణ నుంచి పోటీ చేస్తే దక్షిణాదిలో కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుందనే వ్యూహంపై చర్చ జరిగింది. అయితే.. అనూహ్యంగా ఆమె లోక్ సభ బరి నుంచే తప్పుకున్నారు. రాజస్తాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక ఖమ్మం లోక్ సభ టికెట్ తన హక్కు అని, అది తనకు కేటాయించాల్సిందేనని హాట్ కామెంట్స్ చేసిన ఫైర్ బ్రాండ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా రాజ్యసభకు నామినేట్ అవుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం టికెట్‌కు డిమాండ్ ఎక్కువ ఉన్నది. ఖమ్మంలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అలాగే.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఎక్కువ. అందుకే ఎలాగోలా ఖమ్మం లోక్ సభ టికెట్ సంపాదించుకుంటే చాలు.. గెలుపు నల్లేరు మీద నడకే అనేది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయం. అందుకే ఖమ్మం లోక్ సభ సీటు కోసం దరఖాస్తులు పోటెత్తాయి.

Latest Videos

ఖమ్మం సీటు కోసం 12 మంది కాంగ్రెస్ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఈ టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఆమె రాజ్యసభకు వెళ్లుతున్నారు. అలాగే.. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా ఖమ్మం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, సీనియర్ నేత వీ హన్మంతరావు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: Hyderabad: మన దేశంలో ఉమ్మడి రాజధానిగా ఏయే నగరాలు ఉన్నాయి?

వీరందరిదీ ఒకే మాట.. సోనియా గాంధీ ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేస్తే ఆహ్వానిస్తాం. ఒక వేళ ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయకుంటే మాత్రం టికెట్ మాకే ఇవ్వాలని చెబుతున్నారు. మొత్తానికి సోనియా గాంధీ ఖమ్మం నుంచి లోక్ సభ బరిలో ఉండటం లేదనేది స్పష్టం. దీంతో ఈ టికెట్ ఎవరికి వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

మొదటి నుంచీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కనే ఉండాలని కాంగ్రెస్‌లో ఓ సెక్షన్ డిమాండ్ చేసింది. కానీ, ఆయనను డిప్యూటీ చేసినందునా.. ఆయన భార్య నందినికి టికెట్ దక్కే అవకాశాలు లేకపోలేదు.

click me!