
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ దూకుడు పెంచాలని యోచిస్తున్న తెలంగాణ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ వచ్చిపడుతున్నది. పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్న నేతల సంఖ్య పెరుగుతున్నది. మాజీ మంత్రి, సీనియర్ లీడర్ ఏ చంద్రశేఖర్ రాజీనామా చేసిన 24 గంటల్లోపే మరో కీలక నేత పార్టీకి రిజైన్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బీజేపీ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ కుమార్ రెడ్డి కమలం పార్టీకి బై బై చెప్పేశారు. గ్రూపు తగాదాలతో విసిగిపోయి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో వినయ్ కుమార్‌కు కొన్ని విభేదాలు ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోనే ఆయన పలుమార్లు ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీపై పలు ఆరోపణలు సంధిస్తూ పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖలో ప్రకటించారు.
ఎంపీ అర్వింద్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని వినయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, వీటికి విసిగిపోయే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వినయ్ కుమార్ రెడ్డి 2018లో బీజేపీ టికెట్ పై అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆయన పార్టీకి షాక్ ఇచ్చారు.
Also Read: పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రూ. 5 లక్షల బీమా.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
వినయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇంతలోనే వినయ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీని వీడుతున్నట్టు తెలిపారు. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో హస్తం గూటిని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.