
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి. సంధ్య. తదితరులపై అక్రమంగా మోసిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సమఘం నాయకులు బుధవారం మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి పోలీసులు 2022 ఆగస్టు 19న పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ కామ్రేడ్ వి. సంధ్య, ప్రజాపక్ష మేధావి ప్రొఫెసర్ జి.హరగోపాల్ సహా 152 మంది ప్రజాసంఘాల నాయకులపై తప్పుడు పద్ధతుల్లో రాజద్రోహ కుట్ర కేసు అయిన ఉపా కింద కేసులు నమోదు చేశారని తెలిపారు.
సెప్టెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా..? నేడు హైదరాబాద్ కు రానున్న సీఈసీ బృందం
అయితే 10 నెలల కిందట గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు నమోదు చేసిన ఈ కేసును ఇప్పుడు బహిర్గతపర్చడంపై ప్రభుత్వ కుట్ర దాగి ఉందని అన్నారు. వీరంతా మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాల్లో పనిచేస్తూ రాజద్రోహానికి పాల్పడుతున్నారని తప్పుడు కేసులను బనాయించారని ఆరోపించారు. ఓ వైపు సీఎం కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిస్తూనే.. మరోవైపు తెలంగాణ కోసం అలుపెరగకుండా పోరాడిన వి. సంధ్య, హరగోపాల్, విమలక్క, రఘునాథ్, ప్రొఫెసర్ లక్ష్మణ్ లాంటి వారినందరిని ఉపా కింద తప్పుడు కేసులు బనాయించడం సరైంది కాదని తెలిపారు.
వీరిపై ఉపాతో నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్స్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చర్యను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
వి.సంధ్య నాలుగు దశాబ్దాలకు పైగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే అని అన్నారు. ఆమె ఏనాడు రహస్యంగా జీవించలేదని, పీవోడబ్ల్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ కన్వీనర్ గా కొనసాగుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆమె ముందు వరుసలో నిలబడి కొట్లాడారని అన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ కు కూడా తెలుసని అన్నారు. మహిళా నాయకురాలిగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్న ఆమెను.. మావోయిస్టు దళాల్లో తిరుగుతున్నట్లు, ఆ పార్టీకి క్యాడర్ ను రిక్రూట్ చేస్తున్నట్లు పోలీసులు కట్టు కథలు అల్లి, ఉపా లాంటి రాజద్రోహ కుట్ర కేసును బనాయించడదాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.