కన్నడ అఫైర్స్: జాతీయ కూటమికి ఊపు, కేసీఆర్ ప్లాన్ కు దెబ్బనే...

First Published May 20, 2018, 9:01 AM IST
Highlights

కర్ణాటక రాజకీయాలతోనే జాతీయ స్థాయిలో బిజెపియేతర జాతీయ కూటమికి పాదులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్: కర్ణాటక రాజకీయాలతోనే జాతీయ స్థాయిలో బిజెపియేతర జాతీయ కూటమికి పాదులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు, బిజెపియేతర కూటమిని కట్టాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రణాళికకు కాస్తా విఘాతం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

జాతీయ కూటమిలో కాంగ్రెసు ప్రధాన పాత్రధారిగా కొనసాగే అవకాశాలను కర్ణాటక రాజకీయాలు మెరుగుపరిచాయి. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ, డిఎంకే నేత స్టాలిన్, తదితర ప్రాంతీయ పార్టీల నేతలు కాంగ్రెసు పార్టీని పక్కన పెట్టే పరిస్థితిలో లేరు. 

కర్ణాటక రాజకీయాలు కాంగ్రెసు ప్రాధాన్యాన్ని తెలియజేశాయి. బిజెపిని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలకు తాము ప్రాధాన్యం ఇస్తామనే విషయాన్ని కాంగ్రెసు అధిష్టానం చెప్పకనే చెప్పింది. తక్కువ సీట్లు వచ్చిన జెడిఎస్ కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేయడం ద్వారా కాంగ్రెసు తన వైఖరిని చెప్పకనే చెప్పింది.

ఈ నెల 23వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం చేయనున్నారు. ఇదే జాతీయ స్థాయి కూటమికి పునాదులు వేసే అవకాశం ఉంది. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యే అవకాశం ఉంది. బిఎస్పీ నేత మాయావతి కూడా జెడిఎస్ కు మద్దతుగానే ఉన్నారు. 

కాంగ్రెసును కాదని జాతీయ స్థాయిలో ముందుకు పోవడం సాధ్యం కాదనే ఆలోచనలో దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే, కేసీఆర్ తో చర్చలు జరిపినప్పటికీ ఆయన తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కూ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిన నాయకులు లేరు. 

click me!