లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ ... సీఎం రేవంత్ సహా మంత్రులందరికి కీలక బాధ్యతలు

By Arun Kumar PFirst Published Dec 19, 2023, 7:02 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముందుండి నడిపిన నాయకులకే లోక్ సభ ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించారు. సీఎం రేవంత్ తో సహా మంత్రులందరినీ వివిధ లోక్ సభ స్ధానాలకు ఇంచాార్జీలుగా నియమించారు. 

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా వ్యూహాలతో బరిలోకి దిగి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలాగే త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముందుండి నడిపి గెలుపులో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు రెండేసి నియోజకవర్గాలు అప్పగించారు. మహబూబ్ నగర్, చేవెళ్ల లకు రేవంత్ రెడ్డి,   సికింద్రాబాద్, హైదరాబాద్ లకు భట్టి విక్రమార్క,  మహబూబాబాద్, ఖమ్మం లకు పొంగులేటి ఇంచార్జీలుగా నియమితులయ్యారు.  

నాగర్ కర్నూల్ కు జూపల్లి కృష్ణారావు, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ కు కొండా సురేఖను లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇంచార్జీలుగా నియమించారు. ఇక ఆదిలాబాద్ కు సీతక్క,  పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, జహిరాబాద్ కు పి సుదర్శన్ రెడ్డి,  మెదక్ కు దామోదర రాజనర్సింహ, మల్కాజ్ గిరికి తుమ్మల నాగేశ్వరరావు ఇంచార్జీలుగా నియమితులయ్యారు.

Latest Videos

Also Read  1980 లో మెదక్‌‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?

ఇదిలావుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుండి లోక్ సభ పోటీలో నిలపాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ మేరకు గాంధీ భవన్ లో మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో నాయకులంతా ఏకగ్రీవ తీర్మానం చేసారు. గతంలో ఇందిరాగాంధి మెదక్ లోక్ సభ నుండి ఎంపీగా పోటీ చేసినట్లు ఈసారి సోనియా గాంధీ కూడా తెలంగాణ నుండి లోక్ సభకు పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. 

రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై వుందని కాంగ్రెస్ నాయకులు పదేపదే అంటుంటారు. దీన్ని ఓ సెంటిమెంట్ లా వాడుకుని లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు పొందాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. తెలంగాణలో ఏదో ఒక లోక్ సభ స్థానంలో సోనియా బరిలోకి దింపడం ద్వారా మిగతా నియోజకవర్గాలపై ఆ ప్రభావం వుటుందని భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలపై కన్నేసింది.      

 
 

click me!