
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అడ్డగూడూరు లాకప్‌డెత్ కేసులో మరో అధికారిపై రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ చర్యలు తీసుకున్నారు. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యకు రాచకొండ కమీషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. లాకప్‌డెత్ కేసులో ఇప్పటికే ఎస్సై మహేశ్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కలిపి లాకప్‌డెత్ కేసులో ఇప్పటి వరకు నలుగురు అధికారులపై చర్యలు చేపట్టారు సీపీ.
దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకప్‌డెత్ పై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. లాకప్‌డెత్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఇలాంటి ఘటనలు క్షమించనని సీఎం తేల్చి చెప్పారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని ఉద్యోగంలో నుండి తొలగించాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమన్నారు.మరియమ్మ కొడుకు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకొంటుందని సీఎం హామీ ఇచ్చారు.
Also Read:మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై విచారణకు కేసీఆర్ ఆదేశం
మరియమ్మ కుటుంబానికి రూ. రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సీఎం ఆదేశించారు. ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం ఇవ్వాలని కూడ సీఎం కోరారు. బాధితులను డీజీపీ పరామర్శించి కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలన్నారు.ఈ నెల 28న సీఎల్పీ నేత భట్టి తో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం ఆదేశించారు.