ఆలయ భూముల కబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ మీద మరో కమిటీ

By telugu teamFirst Published May 3, 2021, 1:18 PM IST
Highlights

శామీర్ పేట మండలం దేవర యంజాలలో భూకబ్జాల ఆరోపణలపై కూడా కేసీఆర్ ప్రభుత్వం కమిటీ వేసింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఇతరులు ఆలయ భూములను ఆక్రమించారనే ఫిర్యాదులు వచ్చాయి.

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆలయ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మరో విచారణ కమిటీని వేసింది. నలుగురు ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం ఆ కమిటీని వేసింది. శామీర్ పేట మండలం దేవరయంజాల సీతారామస్వామి ఆలయ బూములను ఆక్రమించారనే ఆరోపణపై విచారణకు ఆ కమిటీ వేసింది.

కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్, బారతి హొలికెరి, శ్వేత మహంతి ఉన్ారు. ఈటెల రాజేందర్, ఇతరులు ఆ భూములను ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ఆ కమిటీని వేశారు. 

దాదాపు 1,561 ఎకరాల ఆలయ భూములను కబ్జా చేశారని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వచ్చాయి. ఆ భూమి వేల కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంటున్నారు. భూముల కబ్జా వెనక ఉన్న పెద్దమనుషులు, బినామీలు ఎవరనేది గుర్తించాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

భూకబ్జాలకు పాల్పపడినవారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా సూచించాలని ప్రభుత్వం సూచించింది. మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఈటెల రాజేందర్ భూములను ఆక్రమించారనే ఆరోపణను విచారణలో నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరిగిన తీరుపై ఈటెల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. 

ఆ కమిటీ ఏర్పాటుపై కూడా ఈటెల రాజేందర్ తన మీడియా సమావేశంలో స్పందించారు. దివాన్ కమిటీ ఆ భూములపై విచారణ జరిపి నివేదిక ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ విషయం కేసీఆర్ కు తాను చెప్పినట్లు కూడా ఆయన తెలిపారు. 

click me!