ఆత్మహత్య చేసుకోవాలనిపించింది... వర్మ సినిమాపై అమృత కామెంట్స్

By telugu news teamFirst Published Jun 22, 2020, 7:56 AM IST
Highlights

ఇప్పటికే తాను జీవితంలో చాలా చీత్కారాలు చూశానని చెప్పింది. తన గురించి, తన క్యారెక్టర్ గురించి కేవలం తన సన్నిహితులకు మాత్రమే తెలుసునని ఆమె పేర్కొంది. కానీ.. చాలా మంది తన క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
 

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రణయ్ హత్య తర్వాత అమృత ఒంటరి పోరాటం చేస్తూనే ఉంది. కాగా... ఇటీవల ప్రణయ్ ని హత్య చేయించిన మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. కాగా... ఈ నిజ జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమాకి శ్రీకారం చుట్టాడు.

ఈ సినిమాకి మర్డర్ అనే పేరు పెట్టగా.. ఫాదర్స్ డే సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ లో మారుతీరావు, అమృత పాత్రదారులను పరిచయం చేశాడు. కాగా... ఈ సినిమాపై తాజాగా అమృత స్పందించింది.

ఆ సినిమా పోస్టరు చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత పేర్కొంది. ఇప్పటికే తన జీవితం తలకిందులయ్యిందని.. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ ని పోగొట్టుకున్నానని బాధ పడింది. కన్న తండ్రికి కూడా దూరమయ్యానని.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించింది.

ఇప్పటికే తాను జీవితంలో చాలా చీత్కారాలు చూశానని చెప్పింది. తన గురించి, తన క్యారెక్టర్ గురించి కేవలం తన సన్నిహితులకు మాత్రమే తెలుసునని ఆమె పేర్కొంది. కానీ.. చాలా మంది తన క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.

పరువు పోతోందనే తప్పుడు ఆలోచనలతో తన తండ్రి ప్రణయ్ ని హత్య చేయించాడని.. కిరాయి గుండాలకు డబ్బు ఇచ్చి మరీ ఈ పాపానికి ఒడిగట్టాడని వాపోయింది. ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతున్నానని.. ఆత్మ గౌరవంతో బతుకుతున్నానని చెప్పింది. ఏదో అలా కాలం వెళ్లదీస్తున్నానని చెప్పింది.

కాగా.. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రూపంలో తనకు మరో కొత్త సమస్య వచ్చిపడిందని అమృత పేర్కొంది. దీనిని అడ్డుకునే శక్తి తనకు లేదని ఆమె చెప్పింది. కనీసం ఏడుద్దామన్నా కన్నీరు రావడం లేదని.. తన హృదయం బండబారిపోయిందని చెప్పింది. దయచేసి తన జీవితాన్ని బజారులో పెట్టవద్దని ఆమె వేడుకుంది.

రామ్ గోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి తాను భయంతో వణికిపోయానని ఆమె చెప్పింది. నా కొడుకును చూసుకుంటూ..ఉన్నంతలో ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నిస్తున్నానని.. మళ్లీ ఈ సినిమా రూపంలో అందరి కళ్లు తనపై పడేలా చేయవద్దని వేడుకుంది.

కాగా.. ఈ సినిమా పోస్టరు పై అమృత ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ‘‘ నువ్వు విడుదల చేసిన పోస్టర్ చూశాను. దీనికి నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీ లాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో చెప్పే తల్లే లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను. ఈ నీచ, నికృష్ట, నిస్వార్థ పూరిత సమాజంలో నువ్వు కూడా ఒకడివి. ఎన్నో బాధలు అనుభవించా. ఇదేమీ కొత్తకాదు. రెస్ట్ ఇన్ పీస్’ అంటూ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశిస్తూ అమృత ప్రకటన విడుదల చేశారు. 

click me!