అమృతను కామెంట్ చేస్తే ఏమౌతుందో తెలుసా..

By Nagaraju TFirst Published 22, Sep 2018, 7:33 PM IST
Highlights

సోషల్ మీడియా వేదికగా తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారికి ప్రణయ్ భార్య అమృత వర్షిని గట్టి షాక్ ఇచ్చింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, విద్వేషపూరిత సందేశాలు పంపుతున్నారని అవి చాలా బాధించాయని అమృత వర్షిణి వాపోయింది

మిర్యాలగూడ: సోషల్ మీడియా వేదికగా తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారికి ప్రణయ్ భార్య అమృత వర్షిని గట్టి షాక్ ఇచ్చింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, విద్వేషపూరిత సందేశాలు పంపుతున్నారని అవి చాలా బాధించాయని అమృత వర్షిణి వాపోయింది. ఇలాగే తనకు విద్వేషపూరిత సందేశాలు పంపితే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తానని స్పష్టం చేసింది అమృత. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే  జరుగుతుంది. ఇటీవలే అమృతకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మంత్రి జగదీష్ రెడ్డి అమృతకు 8లక్షలు ఆర్థికసాయంతోపాటు.. డబుల్ బెడ్ రూం ఇల్లు, 5ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని ప్రకటించారు. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ప్రభుత్వనిర్ణయాన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అమృతను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక సాయాన్ని, ప్రభుత్వం ప్రకటించిన సదుపాయాలను పొందేందుకు ఆమెకు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు.
 
మరోవైపు కొంతమంది అమృతపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఆవేదన చెందిన అమృత తనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో విద్వేషపూరిత సందేశాలు చాలా వచ్చాయని తెలిపింది. ఇలాగే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తానని ఆమె తెలిపింది. తాను ఎవరి సాయం కోరలేదని, బుల్ బెడ్ రూం ఇల్లు కానీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని గానీ అడగలేదని స్పష్టం చేసింది. ప్రణయ్‌ను హత్య చేసిన వారికి శిక్ష పడాలన్నదే తన డిమాండ్ అని పేర్కొంది.
 
అటు ప్రభుత్వం ప్రకటించిన సాయంపై ప్రణయ్ తండ్రి బాలస్వామి ఉద్వేగంగా స్పందించారు. తమకు ప్రభుత్వ సాయం ఏమీ అక్కర్లేదని తాము స్థిరపడిన వాళ్లమేనని తెలిపారు. తనకు సొంత ఇల్లు ఉందని, వ్యవసాయ భూమి కూడా ఉందని చెప్పారు. తాను ఉద్యోగినని, అమృతకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయాన్ని అనాథాశ్రమానికి గానీ లేకపోతే తామే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గానీ సేవలందిస్తామని బాలస్వామి చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో న్యాయం జరగాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని తెలిపారు.

Last Updated 22, Sep 2018, 7:33 PM IST