నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. షెడ్యూల్ ఇదే..

By Sumanth Kanukula  |  First Published Feb 10, 2023, 9:03 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శనివారం జరిగే ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శనివారం జరిగే 74వ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్ల పాసింగ్-అవుట్ పరేడ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించనున్నారు. ఇందుకోసం అమిత్ షా శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు  రాత్రి 10.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శనివారం ఉదయం 7.50 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించే ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్-అవుట్ పరేడ్‌‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం అమిత్ షా రోడ్డు నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 

Latest Videos

ఇక, 74 ఆర్‌ఆర్ (రెగ్యులర్ రిక్రూట్) బ్యాచ్‌కి చెందిన 33 మంది మహిళలతో సహా 166 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొంటారని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. అలాగే పరేడ్‌లో నలుగురు మహిళలతో సహా పొరుగు దేశాల నుంచి 29 మంది విదేశీ అధికారులు పాల్గొంటారని  చెప్పారు. 

కొంతమంది అధికారులకు ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో నేపథ్యం ఉంటే.. 69 శాతానికి పైగా అధికారులు ఇంజనీరింగ్ నేపథ్యం కలిగి ఉన్నారని ఏఎస్ రాజన్ చెప్పారు.  సాంకేతిక నేరాలు పెరుగుతున్న రోజుల్లో ఇది చాలా అవసరమని ఆయన అన్నారు. ‘‘ఈ అధికారుల బృందంలో మహిళలు 23 శాతం ఉన్నారు. ఇది స్వాగతించే సంకేతం. మహిళలు సానుభూతితో, ప్రజా సమస్యల పట్ల సున్నితంగా ఉంటారు.  త్వరగా స్పందిస్తారు కాబట్టి వారు పోలీసు దళానికి బాగా సరిపోతారు’’ అని ఏఎస్ రాజన్ తెలిపారు. 

ఈ శిక్షణ ప్రధానంగా సైబర్ క్రైమ్‌తో సహా ముందున్న కొత్త సవాళ్లపై దృష్టి సారించింది. అంతేకాకుండా కోర్టు ప్రక్రియ, మాక్ ట్రయల్, వైఖరులు, నైతికత వంటి చట్టపరమైన విషయాలను పరిష్కరించడంపై ఫోకస్ చేయడం  జరిగిందన్నారు. 

click me!