బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షా.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేేక పూజలు

By Sumanth KanukulaFirst Published Aug 21, 2022, 2:06 PM IST
Highlights

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన అమిత్ షా.. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన అమిత్ షా.. కాసేపటి క్రితం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి అమిత్ షా చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి  వెళ్లనున్నారు. దాదాపు అరగంట పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.

అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టులో రైతు ప్రతినిధులతో అమిత్ షా సమావేశమవుతారు. తర్వాత సాయంత్రం 4.10  గంటల సమయంలో అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో మునుగోడుకు బయలుదేరుతారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్ని ప్రసంగించనున్నారు. ఇక, అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆయన పర్యటించే ప్రాంతాలతో పాటు, మునుగోడులో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 

మునుగోడు చేరుకుని.. అక్కడ కొద్దిసేపు సీఆర్‌పీఎఫ్ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. అనంతరం మునుగోడులో బీజేపీ సభకు బయలుదేరి వెళతారు. ఈ సభ వేదికగా బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. అమిత్ షా సమక్షంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. 

ఈ సభ అనంతరం ఆయన రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లనున్నారు. అక్కడ దాదాపు 45 నిమిషాల సమయం ఉండనున్నారు. అనంతరం శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ బీజీపీ ముఖ్యనేతలు, పలువురు ప్రముఖులతో అమిత్ షా సమావేశం కానున్నారు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అమిత్ షాను కలవనున్నారు. అనంతరం అమిత్ షా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. 

click me!