ప్రెస్ క్లబ్ ను ఆదర్శంగా తీర్చిదిద్దండి: దేవులపల్లి అమర్

First Published Jul 4, 2018, 6:47 PM IST
Highlights

సభ్యుల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఐజేయు సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె సలహాదారులు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు సూచించారు. 

హైదరాబాద్: సభ్యుల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఐజేయు సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె సలహాదారులు కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీలు సూచించారు. 

బుధవారం నాడు బషీర్ బాగ్ లోని దేశోధరక భవన్ లో టీయుడబ్ల్యుజె, హెచ్ యుజె ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... 1996 లో ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేటలో జరిగిన నాటి ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించాలనే తమ సంఘం విజ్ఞప్తి మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమజిగూడలో స్థలాన్ని కేటాయించారని అమర్ తెలిపారు. 
అయితే 22 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ స్థలం పై ప్రెస్ క్లబ్ కు చట్టబద్ధమైన హక్కులు దక్కక పోవడం విచారకరమన్నారు. కనీసం ఇప్పుడు ఎన్నికైన కార్యవర్గమైనా సీరియస్ గా స్పందించి ఆ ఆస్థి ని దక్కించుకోడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రెస్ క్లబ్ ను ఆధునీకరించేందుకు కార్యవర్గం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని ఆయన కోరారు. 

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి ప్రెస్ క్లబ్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపించాయని, ప్రొఫెషనల్ సంస్థలో అలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో నెగ్గిన నూతన కార్యవర్గంపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, సభ్యుల విశ్వసాన్ని వమ్ము చేయకుండా పని చేయాలన్నారు. 

టీయుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ప్రసంగిస్తూ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ను ఢిల్లీ, చండీగఢ్, రాంచీ, ముంబై ప్రెస్ క్లబ్ ల మాదిరిగా తీర్చిదిద్దడానికి నూతన కార్యవర్గం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 

ప్రెస్ క్లబ్ లో సభ్యులకు, వారి కుటుంబాలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కార్యవర్గం చేసే కృషికి ఏళ్ల వేళలా తమ సంఘం సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. 

ఇంకా ఈ సభలో సీనియర్ పాత్రికేయులు మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజమౌళి చారీ, కోశాధికారి సూరజ్ భరద్వాజ తదితరులు ప్రసంగించగా, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, యూనియన్ సీనియర్ నాయకులు కె.అమర్ నాథ్, మజీద్, కల్లూరి సత్యనారాయణ, ఎ. రాజేష్, 
హెచ్ యు జె అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్ గౌడ్, నాయకులు కోటిరెడ్డి, ఆర్యన్ శ్రీనివాస్, హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శి చారీ, హష్మీ,సీనియర్ పాత్రికేయులు అజిత, రెహ్మాన్, మహంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు.

click me!