Telangana News: టీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు.. సీఎం కేసీఆర్‌కు చిక్కులు..!

Published : Apr 21, 2022, 02:39 PM IST
Telangana News: టీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు.. సీఎం కేసీఆర్‌కు చిక్కులు..!

సారాంశం

TRS Party News: గతకొంత కాలంగా టీఆర్‌ఎస్ నాయకులు వరుసగా వివాదాలకు కేంద్ర బిందువులుగా మారడంతో.. పార్టీ అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. 

తెలంగాణలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. రామాయంపేటకు చెందిన తల్లీకొడుకు ఆత్మహత్య, ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య.. ఈ రెండు ఘటనల్లో టీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మహిళపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు రావడంతో.. కూకట్‌పల్లి టీఆర్ఎస్ కో-ఆర్డినేటర్‌ సతీష్‌ అరోరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుసగా టీఆర్‌ఎస్ నాయకులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారడంతో.. పార్టీ అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి. మరోవైపు ఈ ఘటనలపై ప్రతిపక్షాలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు తప్పులు చేస్తే.. సీఎం కేసీఆర్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నిస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 

రామాయంపేటకు చెందిన పద్మ, ఆమె కుమారుడు సంతోష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు టీఆర్ఎస్ నాయకుల నుంచి తాము వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా ఆరోపించారు. వారి కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌‌తో సహా మొత్తం ఏడుగురు తమ ఆత్మహత్యకు కారణమని వారు చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అఖిలపక్ష నేతలు రామాయంపేట బంద్ కూడా నిర్వహించాయి. బాధిత కుటంబాన్ని ప్రతిపక్ష పార్టీలు పరామర్శించాయి. నిందితులు అధికార పార్టీకి చెందినవారు కావడంతోనే పోలీసులు విచారణ సరైన రీతిలో జరపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్.. పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎష్ నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా భదాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్యులు కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించి.. మంత్రి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకన్న ప్రతిపక్షాలు.. 
ఈ రెండు ఘటనల్లో టీఆర్ఎస్ నాయకుల ప్రమేయంపై ఆరోపణలు ఉండటంతో.. ప్రతిపక్షాలు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై కేసీఆర్ సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పోలీసులు ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నారని, ప్రగతి భవన్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇక, బుధవారం బీజేపీ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి.. ఖమ్మం, రామాయంపేటలో ఇటీవల జరిగిన ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరింది. టీఆర్‌ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య ఉన్న బంధాన్ని బట్టబయలు చేయాలని విన్నవించింది. 

గవర్నర్ కలిసిన అనంతరం బీజేపీ నేతల మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు వంటి హింసాత్మక సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని ఆరోపించారు. మరోవైపు కూకట్‌పల్లిలో మహిళపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్‌ అరోరాను అరెస్ట్ చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు నిరసన చేపట్టారు. ఈ విధంగా గులాబీ పార్టీలో నాయకుల వస్తున్న ఆరోపణలపై చర్యలకు బీజేపీ గట్టిగానే పట్టుబడుతుంది. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని.. రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా తయారైందని ఆరోపిస్తున్నారు. రామాయంపేట బాధితుల కుటుంబ సభ్యలతో ఫోన్‌లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వారికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. మరోవైపు ఖమ్మంలో మంత్రి పువ్వాడ వల్ల తమ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇక, సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ రెండు ఘటనలపై ఘాటుగానే స్పందించారు. రామాయంపేట వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఖమ్మం వెళ్లి కాంగ్రెస్ నాయకులపై వేధింపులకు పాల్పడేవారి సంగతి తెలుస్తామని ఆయన హెచ్చరించారు. సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి కూడా పువ్వాడపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరాతారా అని మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 

ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన సాగిస్తుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారయని.. అయినప్పటికీ కేసీఆర్ స్పందించడం లేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలని  చూస్తున్నారు. సొంత పార్టీ నేతలపై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా టీఆర్ఎస్ నాయకులపై వస్తున్న ఆరోపణలు.. పార్టీ అధినేత కేసీఆర్‌కు చిక్కులు తెచ్చిపెట్టాయనే చెప్పాలి. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?