గాలిలో దీపంలా గురుకులాల్లో భద్రత.. కేసీఆర్ స‌ర్కార్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డింది: విజయశాంతి

Siva Kodati |  
Published : Apr 21, 2022, 02:31 PM ISTUpdated : Apr 21, 2022, 02:35 PM IST
గాలిలో దీపంలా గురుకులాల్లో భద్రత.. కేసీఆర్ స‌ర్కార్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డింది: విజయశాంతి

సారాంశం

విద్యార్ధుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆటలాడుతోందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. భద్రత గాలిలో దీపం అన్నట్లుందని.. విద్యార్థులు పాములు, ఎలుకల కాట్లకు గురవుతున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. 

గురుకులాల్లో (telangana gurukul schools) విద్యార్థులు ప‌డుతోన్న ఇబ్బందుల‌ను ప్రస్తావిస్తూ కేసీఆర్‌ (kcr) ప్ర‌భుత్వంపై బీజేపీ (bjp) నేత విజ‌య‌శాంతి (vijayasanthi) మండిపడ్డారు. ఈ మేరకు గురువారం తన వ్యక్తిగత సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు. 

‘‘ మన దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ స‌ర్కార్ ఆట‌లాడుతుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ విద్యా వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తుండు. ముఖ్యంగా గురుకుల‌ల్లో చ‌దివే విద్యార్థులు బ‌య‌ట‌కు చెప్పుకోలేని ఇబ్బందులు ప‌డుతున్నారు. మంచి విద్య, ఆహారం, వసతి... ఇవీ గురుకులాల్లో విద్యార్థులకు అందించాల్సినవి. చదువు పరిస్థితి ఎలా ఉన్నా... చాలాచోట్ల భద్రత గాలిలో దీపం అన్నట్లుంది. అపరిశుభ్ర వాతావరణం, కనీస జాగ్రత్తలు కొరవడడంతో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థులు పాములు, ఎలుకల కాట్లకు గురవుతున్నారు’’.

‘‘ చ‌దువుకుందామ‌ని వ‌స్తే ప్రాణాలే పోతున్నాయి. అయినా ప్ర‌భుత్వ యంత్రాంగం ఎప్ప‌ుడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. వంట గది శుభ్రతను విస్మరిస్తుండడం, కుళ్లిన ఆహార పదార్థాలు, కూరగాయలను వంటకు ఉపయోగిస్తుండడంతో తరచూ ఎక్కడో ఒకచోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తుంటే అధికారుల నిర్లక్ష్యం... విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. నల్లగొండ జిల్లా దామరచర్లలోని గురుకులంలో కలుషితాహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన మరవకముందే, మరో ఆరుగురిని ఎలుకలు కొరికిన విషయం బయటపడింది’’. 

‘‘పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన ఉన్నా చాలా గురుకులాల్లో ఇది మచ్చుకైనా కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల సరైన వసతి సదుపాయాలు లేకపోవడంతో పాఠాలు విన్న గదిలోనే విద్యార్థులు రాత్రి నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు విద్యార్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే... విద్యార్థుల తినే ఆహారంలో తక్కువ ధరకు లభించే, నాసిరకం పప్పు దినుసులు, కూరగాయలు, ఇతర పదార్థాలు వాడుతున్నారు. ఉన్నతాధికారుల నిరంతర తనిఖీలు లేకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నరు. విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న ఈ కేసీఆర్ స‌ర్కార్‌కు కాలం ద‌గ్గ‌ర ప‌డింది’’ అంటూ విజయశాంతి హెచ్చరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?