తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం.. రాష్ట్రంలో అడుగుపెట్టనున్న మరో దిగ్గజ సంస్థ

By Siva KodatiFirst Published May 24, 2022, 4:58 PM IST
Highlights

తెలంగాణలో మరో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.500 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో అలీఆక్సిస్ కంపెనీ గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీ సెంట‌ర్‌‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల 500 మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల (investment in telangana) ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. రాష్ట్రంలో మ‌రో కంపెనీ భారీ పెట్టుబ‌డి పెట్టేందుకు ఆస‌క్తి చూపింది. తెలంగాణ‌లో అలీఆక్సిస్ కంపెనీ (aliaxis) రూ. 500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీ సెంట‌ర్‌ను ( greenfield facility) ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆ కంపెనీ మంగళవారం ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంత‌రం అలీఆక్సిస్ కంపెనీ ప్ర‌తినిధులు ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ప్లాస్టిక్ పైపులు, యాక్సెస‌రీస్ త‌యారీ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీ త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తే 500 మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. అలీఆక్సిస్ కంపెనీ ఆశీర్వాద్ పైప్స్‌కు చెందిన కంపెనీ.

Also Read:యూకే : ఫలించిన కేటీఆర్ కృషి .. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న దిగ్గజ ఫార్మా సంస్థ

అంతకుముందు దావోస్‌లో (davos) తెలంగాణ ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ (ktr) సోమవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లూలు గ్రూప్స్‌ అధినేత యూసుఫ్‌ అలీ తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆ వెంటనే లూలు గ్రూప్‌ యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సిద్ధం చేయించిన మంత్రి కేటీఆర్‌.. ఆ పత్రాలను అప్పటికప్పుడే యూసుఫ్‌ అలీకి అందజేశారు. దీనిపై యూసుఫ్‌ అలీ మాట్లాడుతూ.. త్వరలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ఐరోపా దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి సంబంధించి.. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల ప్రాజెక్టు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని యూసఫ్ అలీ తెలిపారు. .

అలాగే.. స్పెయిన్‌కు చెందిన బహుళ జాతి కంపెనీ కీమో ఫార్మా కూడా రూ.100 కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ పరిశోధన-అభివృద్ధి విభాగం డైరెక్టర్‌ జీన్‌ డేనియల్‌ బోనీ మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌, బీమా రంగానికి చెందిన ‘స్విస్‌ రే’ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. 

click me!