కేసిఆర్ ఉల్టా స్కెచ్ వర్కవుట్ అయ్యేనా ?

First Published May 2, 2018, 1:28 PM IST
Highlights

తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్

నిన్న మొన్నటి వరకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాలుకు బలపం కట్టుకుని రాష్ట్రాలు పట్టుకుని తిరిగారు తెలంగాణ సిఎం కేసిఆర్. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేసిఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి కలుసుడు కాదు కేసిఆర్ నే హైదరాబాద్ వచ్చి కలుసుడు షురూ అయింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజాగా లక్నో నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి హైదరాబాద్ లో వాలిండు. ప్రగతి భవన్ లో తెలంగాణ సిఎం కేసిఆర్ తో అఖిలేష్ భేటీ అవుతున్నారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో కేసిఆర్ ప్రతిష్టను పెంచే అవకాశాలున్నాయా అన్న చర్చలు షురూ అయ్యాయి.

బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు తెలంగాణ సిఎం తనయుడు, ఐటి శాఖ మంత్రి కేటిఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు. అనంతరం అఖిలేష్ ను ప్రగతి భవన్ కు తీసుకుపోయారు. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం అఖిలేష్ కు కేసిఆర్ విందు ఇవ్వనున్నారు. విందు తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పైనా, తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఈరోజు సాయంత్రం అఖిలేష్ లక్నో వెళ్లిపోయే అవకాశముందని చెబుతున్నారు.

ఫెడరల్ ప్రంట్ ప్రకటన చేసిన తర్వాత సిఎం కేసిఆర్ తొలుత కోల్ కతా వెళ్లి పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బెంగూళూరు వెళ్లి దేవెగౌడ, కుమార స్వామితో భేటీ అయ్యారు. అనంతరం చెన్నై వెళ్లి అక్కడ డిఎంకె అధినేత కరుణానిధితో భేటీ అయ్యారు. తర్వాత ఆ పార్టీ నేత స్టాలిన్ ను కలుసుకున్నారు. డిఎంకె ఎంపి, కరుణానిధి కుమార్తె కనిమొళిని కూడా కలిశారు. మధ్యలో జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరేన్ ఒకసారి హైదరాబాద్ వచ్చి కేసిఆర్ ను కలిసి పోయారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి సిఎం గా పనిచేసిన అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చి కేసిఆర్ ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

అయితే ఇటీవల కాలంలో కేసిఆర్ తనయుడు, మంత్రి కేటిఆర్ వెళ్లి అఖిలేష్ ను కలిశారు. ఆ తర్వాత తాను కలిసిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు కేటిఆర్. అయితే ఆ సమయంలోనే హైదరాబాద్ వచ్చి కేసిఆర్ ను కలవాల్సిందిగా కేటిఆర్ అప్పీల్ చేసినట్లు చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోశించేందుకు ఉవ్విళూరుతున్న అఖిలేష్ సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకునే ఉద్దేశంతోనే కేటిఆర్ ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ వస్తానని వెల్లడించారు. ఆమేరకు బుధవారం ఆయన హైదరాబాద్ వచ్చి కేసిఆర్ తో భేటీ అయ్యారు.

ఇప్పటి వరకు తెలంగాణ సిఎం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ పరిణామం అచ్చొస్తుందన్న ఆశతో ఉన్నారు గులాబీ నేతలు. ఎందుకంటే మాజీ సిఎం అఖిలేష్ స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసిఆర్ ను కలవడం, అది కూడా ఒక పెద్ద రాష్ట్రం నుంచి ప్రతినిధి రావడం తమకు కలిసొస్తుందని చెబుతున్నారు. మరి అఖిలేష్ ఏరకమైన మెసేజ్ ఇస్తారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.

click me!