
అసెంబ్లీ వేదికగా తెలంగాణ సర్కార్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుండి ఒక్క ముస్లిం యువకునికి లబ్ది జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మూడేళ్ళ నుంచి ఒక్క రూపాయి ఇవ్వడం లేదని అన్నారు. దీనిపై హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహమూద్ అలీ వల్ల ఒక్క ముస్లిం యువకుడు అయినా బాగుపడ్డాడా అని ప్రశ్నించారు. అయితే షాది ముబారక్ వల్ల కొద్దిగా అబ్ది చేకూరిందని చెప్పారు.
ఆరోగ్యశాఖలో ప్రభుత్వం చెప్తున్నంతగా పనితీరు లేదని అక్బరుద్దీన్ అన్నారు. టీమ్స్ హాస్పిటల్ ఘనంగా ఓపెన్ చేసి ఎందుకు మూసివేశారో తెలియదని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం లెక్కలు తప్పు చెప్తోందని ఆరోపించారు. కేవలం అభినందనలను మాత్రమే కాదు.. విమర్శలను సైతం ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం మంచి చేస్తోందని.. కానీ ఇంకా చేయాల్సి ఉందని అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. తాము కలిసి పనిచేస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ అభివృద్దిలో టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం కలిసి ముందుకు వెళ్తుందని తెలిపారు.
ఇక, ఈరోజు అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పిన కేసీఆర్.. వారికి శుభవార్త అందించారు. మొత్తం 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా తక్షణమే నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా చెప్పారు.
ఇక, కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాల ద్వారా ఏటా 7వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను ముందే గుర్తించి.. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగుల భర్తీ చేపడతామని వెల్లడించారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు.