గుజరాత్‌లో అడుగు పెట్టబోతున్న ఎంఐఎం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ

Published : May 30, 2022, 01:09 PM IST
గుజరాత్‌లో అడుగు పెట్టబోతున్న ఎంఐఎం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ

సారాంశం

ఎంఐఎం పార్టీ గుజరాత్‌లో అడుగుపెడుతున్నది. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయం మరికొంత కాలం తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.  

అహ్మదాబాద్: ఏఐఎంఐఎం పార్టీ గుజరాత్‌లోనూ అడుగుపెట్టబోతున్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ కోసం జరుగుతున్న సన్నాహకాలను పర్యవేక్షించడానికి అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం పోరుబందర్ చేరుకున్నారు. అక్కడే కొందరు విలేకరులతో ఆయన మాట్లాడారు.

తాను పోరుబందర్‌లో కొన్ని పార్టీ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చానని, అలాగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కచ్‌లో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చానని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అందు కోసం సిద్ధం అవుతున్నామని వివరించారు. ఇదే సందర్భంగా ఆయన గత స్థానిక ఎన్నికలను గుర్తు చేశారు. గత స్థానిక ఎన్నికల్లో తాము కేవలం 12 రోజులు మాత్రమే కష్టపడ్డామని, కానీ, మంచి ఫలితాలు రాబట్టామని వివరించారు. తమ పార్టీ నుంచి కార్పొరేటర్లు గెలిచారని గుర్తు చేశారు.

అభివృద్ధి, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, మైనార్టీ, దళితుల అభ్యున్నతి వంటి కీలక అంశాలు అజెండాగా తాము ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని వివరించారు. అయితే, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారని ప్రశ్నించగా.. దానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయంపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని, ఇప్పుడే దాని గురించి మాట్లాడటం సరికాదని వివరించారు. అందకు ఇంకా చాలా సమయం ఉన్నదని తెలిపారు. ఎన్నికలు మరింత సమీపించిన తర్వాత తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామో వెల్లడిస్తామని వివరించారు.

అసదుద్దీన్ ఒవైసీ శనివారం మహారాష్ట్రలోని భీవండిలో మాట్లాడారు. ఇక్కడ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు సంధించారు. వారు ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్ కోసం తాజ్ మహల్‌లో వెతుకుతున్నారని విమర్శించారు. 

తాజ్‌ మహల్‌లో శాశ్వతంగా మూసేసిన 22 గదులను తెరవాలని, తెరిచి అందులో హిందూ విగ్రహాలు ఉన్నాయేమో చూడాలని డిమాండ్ చేస్తూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాజకీయం రేగింది కూడా. తాజ్ మహల్ సమాధి కాదని, అది పురాతన శివ ఆలయం అని, తేజో మహాలయం అని కొందరు వాదించడం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు