
హైదరాబాద్ బేగంబజార్ పరువు హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీరజ్ హత్యతో అతడి భార్య సంజన తల్లిదండ్రులు, సోదరుడికి సంబంధం లేదని పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. నీరజ్‌ను సంజన ప్రేమ పెళ్లి చేసుకోకముందే.. ఆమెకు నిందితుల్లో ఒకరితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. నీరజ్ తరుచూ బేగంబజార్‌కు రావడంతో కొందరు తమను హేళన చేశారని ఇద్దరు నిందితులు సంజయ్ యాదవ్, విజయ్ యాదవ్‌లు పోలీసులుకు తెలిపారు. నీరజ్‌ను పెళ్లి చేసుకుందనే కక్షతోనే హత్య చేశామని ఇద్దరు నిందితులు చెప్పారు.
ఇక, నేటితో సంజయ్ యాదవ్, విజయ్ యాదవ్ పోలీసు కస్టడీ ముగియనుంది. దీంతో పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచననున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు.. అభినందన్, మహేష్‌తో పాటు మైనర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని పోలీసుల ఆలోచిస్తున్నారు. వారి వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను రాబట్టాలని చూస్తున్నారు.
అసలేం జరిగింది..
బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకన్న నీరజ్‌పై ఆమె కుటుంబ సభ్యుల కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నిందితులు.. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ మృతిచెందాడు.
ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు సంజయ్ యాదవ్, విజయ్ యాదవ్‌లకు న్యాయస్థానం ఈ నెల 27న నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. మరో నలుగురు నిందితులను కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. హత్యతో నేరుగా సంబంధం ఉన్న విజయ్, సంజయ్‌లను మాత్రమే కోర్టు కస్టడీకి అనుమతించింది.