
తెలంగాణ , హైదరాబాద్‌పై బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత కల్లోలాలు సృష్టించేందుకు హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసిందన్నారు. కానీ బీజేపీ సర్జికల్ స్ట్రైక్‌ను హైదరాబాద్ ప్రజలు భగ్నం చేశారని ఒవైసీ వ్యాఖ్యానించారు. పాతబస్తీలో కొంతమంది ఆందోళన చేశారని.. అందులో తప్పేముందని అసదుద్దీన్ ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు విసరలేదని ఆయన స్పష్టం చేశారు. కొందరి ఇళ్లల్లోకి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పోయి అదుపులోకి తీసుకున్నారని ఒవైసీ పేర్కొన్నారు. వాళ్లను విడిపిస్తే దాంట్లో తప్పేముందుని అసదుద్దీన్ నిలదీశారు. రాజాసింగ్‌కు ఇప్పటికీ బీజేపీ మద్ధతుందని ఆయన ఆరోపించారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో శుక్రవారం నాడు ఓ వర్గం వారి ప్రార్ధనలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రార్థనలు ముగిసిన తర్వాత కొందరు యువకులు నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించారు. సాధారణంగా ప్రతి శుక్రవారం నాడు ప్రార్ధనలకు వచ్చే వారి కంటే తక్కువ మంది ఇవాళ ప్రార్ధనలకు వచ్చారు. ప్రార్ధనలు ముగిసిన తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
ALso Read:శాంతియుతంగా ప్రార్థనలు నిర్వహించండి.. ముస్లింలకు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు
శుక్రవారం నాడు పాతబస్తీలోని మక్కా మసీదు, శాలిబండ, మొఘల్ పురాల్లో సామూహిక ప్రార్ధనలు జరుగుతాయి. ఈ ప్రార్ధనల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. దీంతో పాతబస్తీలో సుమారు 4 వేలకు పైగా మందితో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ పోర్స్, టాస్క్ ఫోర్స్, క్విక్ యాక్షన్ ఫోర్స్ వంటి బలగాలు పాతబస్తీలో భద్రతను ఏర్పాటు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పీడీయాక్ట్ పై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకోవాలని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఓ వర్గం మత పెద్దలతో పోలీసులు నిన్న రాత్రి చర్చలు జరిపారు. మత పెద్దల పిలుపుతో పాటు అసద్ పిలుపు మేరకు ప్రశాంతంగా ప్రార్ధనలు ముగిశాయి.