తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేసే దిశగా సాగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేసే దిశగా సాగుతుంది. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడిగా తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎంపీ సుబ్బురామన్ తిరునావుక్కరసర్‌ను నియమించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, తిరునావుక్కరసర్ గతంలో తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు.
ఇదిలాఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 55 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవల విడుదల చేసింది. మిగిలిన అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు నేటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచరాన్ని ముమ్మరం చేయనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుధవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ములుగులోని రామప్ప దేవాలయంలో పూజలు చేసిన అనంతరం టీపీసీసీ విజయభేరి బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
టీపీసీసీ బస్సుయాత్ర మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశ అక్టోబర్ 18 నుండి 20 వరకు కొనసాగుతుంది. మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొదటి దశ బస్సు యాత్ర సాగనుంది.