సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ.. పూర్తి వివరాలు ఇవే..

Published : Aug 17, 2023, 02:21 PM IST
సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

ఖమ్మంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2023-24 నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూటింగ్ అధికారులు తెలిపారు.

ఖమ్మంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2023-24 నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూటింగ్ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష పూర్తయింది. తొలివిడత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని సూర్యాపేట జిల్లాలో 17 రోజుల పాటు నిర్వహించగా.. సుమారు 45 వేలమంది వరకు హాజరయ్యారు. ఆన్‌లైన్ పరీక్షలో 7,397 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వారికి ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ కీట్స్ కే దాస్ బుధవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అవసరమైన భద్రత, రవాణా, తాగునీరు, సీసీ కెమెరాలు, ఇతర లాజిస్టిక్‌లపై చర్చలు జరిగాయి.

మీడియాతో కల్నల్ మాట్లాడుతూ.. అభ్యర్థుల అడ్మిట్ కార్డులో హాజరు తేదీ, సమయాన్ని పొందుపరిచామని తెలిపారు. అవసరమైన పత్రాలు లేకపోతే అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌కు అనుమతించబడరని చెప్పారు. అభ్యర్థులు తమతో పాటు అవసరమైన అన్ని పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. 

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మధ్యవర్తులకు ఆస్కారం లేదని, మెరిట్, ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రకారం రిక్రూట్‌మెంట్ ర్యాలీని పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు దళారుల మాటల్ని విశ్వసించవద్దని.. ఎవరైనా మధ్యవర్తులు సంప్రదిస్తేవెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ విష్ణు  ఎస్ వారియర్ హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే